* బీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టోలపై అమిత్ షా కామెంట్స్
బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లాలో బీజేపీ సకల జనుల సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నదని విమర్శించారు. కేంద్ర నిధులు మళ్లించి జేబులు నింపుకున్నారని మండిపడ్డారు. కమీషన్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి మీరు వేసే ఓటు తెలంగాణ, దేశ భవిష్యత్‌ను మారుస్తుందని చెప్పారు. అవినీతితో నిండిన కేసీఆర్ కారును మోడీ సంక్షేమ గ్యారేజీలో పడేస్తామని ఎద్దేవా చేశారు. స్మార్ట్ సిటీ కింద నల్లగొండ జిల్లా అభివృద్ధికి మోడీ ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని.. దాని కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధమయ్యారని.. అందుకే అమలుకు సాధ్యం కానీ హామీలను గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు ఒక్కటే అని స్పష్టం చేశారు. మోడీ సుపరిపాలన-కేసీఆర్ నిర్లక్ష్య పాలనకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, లంచగొండి పార్టీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని సంచలన హామీ ఇచ్చారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
* కేసీఆర్ అంటనే నమ్మకం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతూ.. జూటా మ్యానిఫెస్టో విడుదల చేసిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో 3 గంటలైనా కరెంట్ రావట్లేదని.. కాంగ్రెస్ పై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.మూడు, నాలుగు గంటల కరెంట్ తో రైతులకు ఇబ్బందులు పడతారని.. మూడు గంటలతో ఎన్నిపంటలు పండుతాయని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ అంటనే నమ్మకం, కేసీఆర్ అంటే విశ్వాసమని మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పథకాలన్నీ పేదల కోసమే ప్రవేశపెట్టామని తెలిపారు. సౌభాగ్యలక్ష్మీ స్కీమ్ కింద మూడువేలు అందజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పించన్లు రూ. 5వేలకు పెంచుతామన్నారు.
* బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు
బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు మద్దతుగా మైతాపూర్‌లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 55ఏళ్లు పరిపాలన చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మరోసారి ఒక్క అవకాశం అంటూ కాంగ్రెస్ పార్టీ అడగడం విడ్డూరమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
* రాహుల్ పై పరువు నష్టం కేసు పెట్టిన భాజపా నేతకు కీలక పదవి
‘మోదీ ఇంటి పేరు’ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పరువు నష్టం కేసు పెట్టిన భాజపా నేతకు కీలక పదవి దక్కింది. రాహుల్‌పై సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పూర్ణేశ్ మోదీ (Purnesh Modi)ని దాద్రానగర్ హవేలీ – దామన్ దయ్యూలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా అధిష్ఠానం నియమించింది. అదే విధంగా మరో భాజపా నేత దుష్యంత్ పటేల్‌కు కో- ఇంఛార్జీగా పదవి లభించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.2019లో కర్ణాటకలోని కొల్లార్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటి పేరు’ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో రాహుల్‌పై గుజరాత్ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరుసటి రోజే లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత దిగువస్థాయి కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో.. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
* జగన్‌కు వ్యతిరేక ఓటు ఎక్కడా లేదు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా జనం వెంటే ఉన్నారని మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే మంచి చేసుకునేవారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. జగన్ అందిస్తున్న పథకాలను చూశాక చంద్రబాబు ఎంత దోచుకు తిన్నారో ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన విమర్శించారు. జగన్‌కు వ్యతిరేక ఓటు ఎక్కడా లేదన్న ఆయన.. పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యమన్నారు.పేదల ఆరోగ్యం, చదువుకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. కులాల స్థితిగతులు మెరుగు పడ్డాయని అంటే సీఎం జగన్ కారణమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరమని.. ఎంత మంది కలసి వచ్చినా జగన్‌ను ఎలా కాపాడుకోవాలి అనేది ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.సామాజిక సాధికారత అంటే చంద్రబాబు దృష్టిలో ఆయన కులాన్ని మాత్రమే ఉద్ధరించడమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. ఎస్సీలు, బీసీలను బానిసలుగా చూడాలనే భావజాలం చంద్రబాబుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత కోరుకున్న విధంగా అన్ని రంగాల్లోనూ అన్ని కులాలకు ప్రాధాన్యత సీఎం జగన్ కల్పిస్తున్నారని మంత్రి చెప్పారు. చంద్రబాబు దృష్టిలో బీసీలంటే ఓట్లు వేసేవాళ్ళు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాగానే టీడీపీలో అచ్చెన్నాయుడిని పక్కకి తోసేశారని మంత్రి చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో బీసీలకే ప్రధానమైన మంత్రి పదవులు దక్కాయన్నారు. జగన్ వెంట జనం ఉన్నారన్న మంత్రి.. అబద్ధపు చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
* ఆర్బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్(S Venkitaramanan) కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. ఆనారోగ్యం కారణంగా ఆయన ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. ఆర్బీఐ 18వ గవర్నర్‌గా వెంకటరమణన్ బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి 92 వరకు ఆయన ఆ పోస్టులో ఉన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖలో ఆయన 1985 నుంచి 1989 వరకు ఆర్ధిక కార్యదర్శిగా కూడా చేశారు. ఆయనకు గిరిజా, సుధా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
* జగన్‌పై ప్రశంసలు కురిపించిన ఆదిమూలపు సురేష్
నేను ఈ రోజు మంత్రిగా ఉన్నానంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుణ్యమే అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ బస్సు యాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓట్లకోసమే వాడుకున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, సామాజిక, సాధికారతలో న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ హయాంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలకు సామాజిక సాధికారత దక్కిందని స్పష్టం చేశారు. నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమేనన్న ఆయన.. డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు.. మైనార్టీ, బీసీలకు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు. మంచి జరిగి ఉంటేనే మరోసారి వైఎస్ జగన్ ను ఎన్నుకోండి అంటూ పిలుపునిచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 16వ రోజుకు చేరింది.. విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ రోజు వైయస్సార్ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో కొనసాగుతున్నాయి.. ఒకేసారి మూడు ప్రాంతాల్లో సాగుతోన్న ఈ యాత్రల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు నేతలు.
* రాత్రి వేళ ఒంటరిగా హోటల్‌కు వెళ్లిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సందడి చేశారు. పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్ ప్రోటోకాల్ ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు ఆయనను పెద్దగా ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఆర్డర్ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు. కేటీఆర్ వస్తున్నారంటే కాన్వాయ్‌తో పాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది.కానీ.. ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆయన బిర్యానీతో పాటు.. పలురకాల దేశవిదేశీ వంటకాల రుచి చూశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఆయనకు స్పెషల్ డిషెస్‌ను వడ్డించారు రెస్టారెంట్ యాజమాన్యం. ఆయన ఇటు డిన్నర్ చేస్తూనే.. అక్కడకు వచ్చిన వారిని పలకరించారు. మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ రాకతో హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో సెల్ఫీలకోసం ఎగబడ్డారు జనం.
👉 – Please join our whatsapp channel here –