బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై చర్యలు తీసవుకోవాలని కోరింది. ప్రజా ఆశీర్వాద సభల పేరిట బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొంది.
వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్‌ను దోకేబాజి పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు విమర్శలు చేశారని, ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని కంప్లయింట్‌లో తెలిపింది.
కాగా, ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఈవోకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ కంప్లయింట్ ఇచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఇంతేగాక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అడ్వర్టైజ్‌మెంట్‌లపైనా బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లలో కేసీఆర్‌ను కించపరుస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే ఈ యాడ్‌లు ఆపాలని ఈసీ ఆదేశాలిచ్చింది.
👉 – Please join our whatsapp channel here –