రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, పరిశ్రమలకు తెచ్చేందుకు, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా విశాఖ వేదికగా జరిగిన సదస్సులో పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. అందులో కొన్ని సంస్థలు తమ పనులను కూడా ప్రారంభించాయి.. ఇక, ఇతర పెట్టుబడుల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఇప్పుడు జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్.. ఏపీలో భారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది.. చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు కానుండడం ఏపీలోనే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ప్రకటించింది.
అయితే, పెప్పర్ మోషన్ సంస్థకు ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాల భూమిని కేటాయించింది.. దాంతో పాటు పలు రాయితీలను కూడా ప్రకటించింది.. 600 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ.4,640 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. ఈ పరిశ్రమ ద్వారా 8,080 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు… టెస్లా మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్‌తో పాటు డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టు పెప్పర్ మోషన్ పేర్కొంది. ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభంకానుండగా.. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది ఆ సంస్థ.. ఇక, 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని పేర్కొంది..
👉 – Please join our whatsapp channel here –