Devotional

ఎనిమిది టన్నుల పుష్పాలతో శ్రీవారికి అర్చన

ఎనిమిది టన్నుల పుష్పాలతో శ్రీవారికి అర్చన

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. అంతకుముందు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యాన్ని అర్చకులు చేశారు.

ఎనిమిది టన్నుల పుష్పాలతో అర్చన..దాదాపు 8 టన్నుల… చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, నిత్యమల్లి, తామర, కలువ, మొగలి రేకులు, మానసంపంగి, పారిజాతం పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లకు అర్పించారు. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవ‌లో పాల్గొన్నారు. ఆ త‌రువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z