DailyDose

ఇండియాకు వస్తున్న కార్గో షిప్ హైజాక్

ఇండియాకు వస్తున్న కార్గో షిప్ హైజాక్

యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్‌ తమకు సంబంధించిన ఓ నౌకను హైజాక్‌ చేశారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. కీలకమైన ఎర్ర సముద్రంలో ఆదివారం ఆ కార్గో నౌకను హైజాక్‌ చేశారని తెలిపింది. దీంతో ఇజ్రాయెల్‌, హమాస్‌ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నౌకను తామే అదుపులోకి తీసుకున్నామని హౌతీ రెబల్స్‌ ప్రకటించారు. బల్గేరియా, ఫిలిప్పీన్స్‌, మెక్సికో, ఉక్రెయిన్‌కు చెందిన 25 మంది సిబ్బందితో తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఈ కార్గో నౌకను హౌతీ రెబల్స్‌ హైజాక్‌ చేశారని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అందులో ఇజ్రాయెలీలెవరూ లేరని వెల్లడించింది. భారతీయులూ లేరని ధ్రువీకరించింది. గెలాక్సీ లీడర్‌ అనే ఈ నౌకను హైజాక్‌ చేయడాన్ని ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇరానియన్‌ తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసే తీవ్ర చర్యగా పేర్కొంది. ఈ నౌక బ్రిటన్‌ కంపెనీ యాజమాన్యంలోనిదని, జపాన్‌ నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. రే కార్‌ క్యారియర్స్‌ అనే సంస్థ ఈ నౌక యజమానిగా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంది. ఆ సంస్థ అబ్రహాం రామి ఉంగర్‌ అనే వ్యాపారిది. ఆయన ఇజ్రాయెల్‌లో అత్యంత సంపన్నుడు. నౌక హైజాక్‌పై ఆయనను సంప్రదించగా.. తనకు విషయం తెలిసిందని, వివరాలు అందకుండా స్పందించలేనని తెలిపారు. నౌకను యెమెన్‌ తీరానికి రెబల్స్‌ తరలించినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z