తమ తండ్రి కేసీఆర్ ప్రజా జీవితంలో ఉండటం వల్ల చిన్నతనంలో ఆయన ప్రభావం తనపై తక్కువగా ఉండేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. తమ తల్లిని చూసి చాలా నేర్చుకున్నామన్నారు. నగరంలోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో #WomenAskKTR పేరుతో మహిళలతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబం గురించి కేటీఆర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన సతీమణి చాలా ఓపికగా ఉంటారని చెప్పారు. తన చెల్లి చాలా డైనమిక్ అని.. కుటుంబంలో ఆమె అంత ధైర్యవంతులు లేరన్నారు. తన కుమార్తె చిన్నవయసులోనే చాలా బాగా ఆలోచిస్తోందన్నారు. పిల్లలిద్దరినీ సమానంగా చూస్తానని చెప్పారు. కూతురు పుట్టాక తన జీవితం చాలా మారిందని కేటీఆర్ అన్నారు.
నేను రష్మిక అంత ఫేమస్ కాదు….భారాస మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామని కేటీఆర్ చెప్పారు. డీప్‌ఫేక్ మహిళలకు మాత్రమే కాకుండా రాజకీయ నేతలకు సైతం ప్రమాదమేనని చెప్పారు. ప్రత్యర్థులు డీప్‌ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను రష్మిక అంత ఫేమస్ కాదని ఈ సందర్భంగా ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని.. దీనిపై బాధగా ఉందన్నారు. ఈ సంఖ్య పెరిగేలా చూస్తామని చెప్పారు.హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే అని వివరించారు. కొవిడ్ సమయంలో సుచిత్ర ఎల్లా, మహిమా దాట్ల వంటి వారు గొప్పగా నిలిచారని చెప్పారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని.. అది తాము నేర్చుకోవాలన్నారు.
మేమే గెలుస్తామని తెలుసు.. వాళ్లు నటిస్తున్నారు
‘‘ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందించాం. మైనారిటీల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించాం. ప్రతి చిన్నారిపై రూ.10వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 61 శాతానికి పెరిగాయి. శిశుమరణాలను తగ్గించాం. స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. ఏపీ, తెలంగాణ మహిళలు స్త్రీ నిధి రుణాలు తీసుకుని 99 శాతం చెల్లిస్తున్నారు. ఆ రుణాలతో వాళ్లు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. మేం మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్ని పథకాలు పూర్తిచేశాం.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మహిళా యూనివర్సిటీ, కల్యాణలక్ష్మి, అమ్మఒడి వంటివి అందుబాటులోకి తీసుకొచ్చాం. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నాం. సుల్తాన్‌పూర్, నందిగామ సహా మొత్తం నాలుగుచోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశాం. ప్రతిపక్షాలకు కూడా మేమే గెలుస్తామని తెలుసు.. కానీ వాళ్లు నటిస్తున్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఐటీ కంపెనీలు ఉప్పల్ వైపు తీసుకొద్దాం.. మహిళ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం..
గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటికి ఆలస్యంగా వస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఓ మహిళ ప్రశ్నించారు. ఉప్పల్ వైపు ఆ కంపెనీలు వస్తే తమ పిల్లలు త్వరగా ఇంటికి చేరుకుంటారని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. రజనీకాంత్‌కు కూడా గచ్చిబౌలి నచ్చుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. ఉప్పల్ వైపు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగులు త్వరగా ఇంటికి వచ్చేలా చేద్దామని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –