చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ క్రమంలోనే చంద్రుడిపై మరిన్ని పరిశోధనల కోసం ఇస్రో (ISRO) చంద్రయాన్-4 (Chandrayaan-4)/లుపెక్స్ (LuPEX) పేరుతో మరో కీలక ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి పైనుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోందని ‘స్పేస్ అప్లికేషన్ సెంటర్’ (ISRO SAC) డైరెక్టర్ నీల్ దేశాయ్ తెలిపారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రయాన్-4 గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘‘చంద్రయాన్-3 విజయం ఇచ్చిన ఆనందంతో ఇప్పుడు మేం చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం లునార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (LuPEx)ను సిద్ధం చేస్తున్నాం. చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగింది. చంద్రయాన్-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది. ఇందులో 350 కేజీల బరువున్న రోవర్‌ను (చంద్రయాన్-3లో రోవర్ బరువు 30 కేజీలు) పంపనున్నాం. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగాడుతుంది. చంద్రయాన్-3 మిషన్ జీవిత కాలం ఒక లునార్ డే (భూమిపై 14 రోజులతో సమానం) కాగా, చంద్రయాన్-4.. ఏడు లునార్ డే (భూమిపై సుమారు వంద రోజులు)లపాటు పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్ కోసం రెండు లాంచ్ వెహికల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది’’ అని నీల్ దేశాయ్ వెల్లడించారు.
చంద్రయాన్-3 విజయం తర్వాత మరింత పెద్ద సవాల్‌కు సిద్ధం కావాలని ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారని నీల్ దేశాల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ ‘JAXA’తో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –