తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ వెల్లువిరుస్తోంది. కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తూ, పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం, వేములవాడ వంటి తదిత ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలోని గంగాధర మండపం, ఉత్తర శివమాడవీధిలో కార్తీకదీపాలను వెలిగిస్తూ తమ కోరికలు నెరవేరాలని స్వామి వారికి ప్రార్థనలు చేస్తున్నారు.
కార్తీక మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరగనున్న క్రమంలో శ్రీశైలంలో భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శనానికి అనుమతిచ్చారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న వేలాది మంది భక్తులు.. ఇప్పటికే క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అయితే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నేడు ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు.
నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలు వెలిగించి, పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ కు వేకువజాము నుంచే భక్తులు రావడం మొదలుపెట్టారు.
👉 – Please join our whatsapp channel here –