NRI-NRT

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి 707 ఏళ్ల జైలుశిక్ష!

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి 707 ఏళ్ల జైలుశిక్ష!

అమెరికాలో పిల్లలపై వేధింపులకు పాల్పడిన ఓ రాక్షసునికి న్యాయస్థానం 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 17 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు అశ్లీల చిత్రాలు చూపించిన కేసుల్లో ధర్మాసనం దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో నిందితునికి ధర్మాసనం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది.

మాథ్యూ జక్ర్‌జెవ్స్కీ(34) బేబీకేరింగ్ తరహా సేవలు అందించేవాడు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న 17 మంది మగ పిల్లలను లైంగికంగా వేధించాడు. చిన్నారులకు అశ్లీల చిత్రాలు కూడా చూపించేవాడని న్యాయస్థానం గుర్తించింది. ఈ నేరాల్ని నిందితుడు 2014 నుంచి 2019 మధ్య పాల్పడ్డాడు. 2 నుంచి 12 ఏళ్ల పిల్లలపై మాథ్యూ వేధింపులు జరిపాడు. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ విదేశాలకు వెళ్తుండగా.. 2019 మే 17న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో తాజాగా తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది.

దోషిపై ఎలాంటి దయ చూపించవద్దని, ఉరిశిక్ష విధించాలని ధర్మాసనాన్ని ఇద్దరు పిల్లలకు చెందిన బామ్మ కోరింది. తమ పిల్లలను చూసుకోవడానికి ఇలాంటి రాక్షసున్ని నియమించుకున్నందుకు బాధపడుతున్నామని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాథ్యూ తన రహస్యాలను బయటకు చెప్పకుండా పిల్లలను హెచ్చరించేవాడని ఓ బాలుడి తల్లి దుయ్యబట్టింది.

న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత మ్యాథ్యూ నేరాలకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. తాను పిల్లలకు ఆనందాన్నే పంచానని న్యాయమూర్తికి తెలిపాడు. పిల్లల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. తాను ఎలాంటి అపరాధం చేయలేదని, తన చర్యలను సమర్థించుకున్నాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z