రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించడం మామూలే. కానీ, ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘లోకల్ మ్యానిఫెస్టో’. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పథకాలను, చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తుంటారు. కనీసం నాలుగైదు జిల్లాలను ప్రభావితం చేసే స్థాయిలో అయినా మ్యానిఫెస్టో ఉండాలని భావిస్తారు. దీంతో నియోజకవర్గ స్థాయి సమస్యలకు ఆయా మ్యానిఫెస్టోల్లో స్థానం దక్కదు. స్థానికులకు అది పెద్ద సమస్యే అయినా.. రాష్ట్రస్థాయిలో చూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి అభ్యర్థులు ‘లోకల్ మ్యానిఫెస్టో’లు విడుదల చేస్తున్నారు.
నియోజకవర్గంలో పంచే కరపత్రాల్లో ఆయా పార్టీలు ప్రకటించే పథకాలు ఓవైపు ముద్రించి.. మరోవైపు తమను గెలిపిస్తే నియోజకవర్గంలో ఏయే పనులు చేపట్టేదీ వివరిస్తున్నారు. ఆ హామీలతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందరి కంటే ముందున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా సభల్లో స్థానిక బీఆర్‌ఎస్ అభ్యర్థులు మాట్లాడుతూ.. ఆ నియోజకవర్గానికి ఏమేం కావాలో నేరుగా సీఎం కేసీఆర్ ముందే వివరిస్తున్నారు. అనంతరం ఆయా హామీలను నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంగా హామీ ఇస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే హామీలు ఇస్తుండటంతో ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని నిపుణులు చెప్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –