NRI-NRT

ఎన్నికల ప్రచారంలో గల్ఫ్ ప్రవాసీయులు

ఎన్నికల ప్రచారంలో గల్ఫ్ ప్రవాసీయులు

విధి నిర్వహణకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తే వేతనంలో కోత విధించే విదేశాలలో ప్రవాసీయులకు ప్రతి గంటా ముఖ్యమే! అలాంటిది ఉద్యోగాలకు సెలువులు పెట్టి లేదా తాము చేసే లాభార్జిత వ్యాపారాలను పక్కన పెట్టి మరీ స్వదేశానికి వచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం అభిమానంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తూ తమ అభిమాన నాయకుల విజయానికి ప్రయత్నం చేస్తున్న ప్రవాసీయులు కూడా కొందరు ఉన్నారు. గల్ఫ్ వలసల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఈ అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది.

​దుబాయి నగరంలోని వంట నూనెల పరిశ్రమలో నాణ్యతా విభాగంలో కీలక ఉద్యోగం చేసే రాజన్న సిరిసిల్లా మండలం చందుర్తి మండలం బండలింగపురం గ్రామానికి చెందిన కటుకం రవి సుదీర్ఘకాలంగా గల్ఫ్‌లో పని చేస్తున్నా మనస్సు మాత్రం స్వంత గడ్డపై కొట్టుకుంటోంది. వేములవాడ శాసనసభ నియోజకవర్గ పరధిలోకి వచ్చే ఈ మండలానికి చెందిన కొన్ని వేలాది మంది ఎడారి దేశాలలో పని చేస్తుండగా అందులో రవి ఒకరు.

​ప్రవాసీయులు భారీ సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గత ఎన్నికల్లో 5,268 ఓట్లతో ప్రవాసీయుడైన చెన్నమనేని రమేశ్ బాబు చేతిలో పరాజయం పొందారు. అంతకు ముందు జరిగిన ఎన్నికలలో కూడా హోరాహోరిగా పోరాడిన ఆయన స్వల్ప తేడాతో విజయాన్ని అందుకోలేకపోయారనే సానుభూతి ఉంది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఆది శ్రీనివాస్‌కు అంగబలం ఉన్నా ఆర్థబలం లేక వెనుకబడుతున్నట్లుగా ఆయన అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. ప్రతి రోజూ గల్ఫ్ పంచాయితీలు చేసే ఆయన ఈ సారి ఎలాగైనా శాసనసభకు పంపించాలని ఎడారి దేశాలలోని ఆయన అభిమానులు అభిలషిస్తున్నారు.

సౌదీ అరేబియాలో పని చేసే మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన ప్యాట నారాయణది నిమిషం తీరిక లేకుండా చేసే ఆహార ధాన్యాల దిగుమతి వ్యాపారం. అయినా, ఆయన తన వ్యాపారం మొత్తం సిబ్బందికి అప్పగించి మరీ స్వదేశానికి వచ్చి ఆది శ్రీనివాస్ కొరకు అహర్నిశలూ ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా అనేక మంది వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి కొరకు ప్రచారం చేస్తున్నారు. ​బీఆర్ఎస్ విషయానికి వస్తే, ఒక్క అమెరికా నుండి 15 మంది బీఆర్ఎస్ అభిమానులు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నట్లుగా సమాచారం. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, హైద్రాబాద్ నగరంలోని చాంద్రయాణగుట్ట నియోజకవర్గం మజ్లీస్ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీలకు కూడా గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండడమే కాకుండా వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్నారు. వీరి అభిమానులు అనేకులు గల్ఫ్ దేశాలలోని తమ ఉద్యోగాలకు సెలువులు పెట్టి స్వదేశానికి వచ్చి తమ నాయకుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z