ప్రభుత్వ రంగ ‘ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ’ ఐపీఓ (IREDA IPO) సోమవారం ప్రారంభమైంది. నవంబర్ 23న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.30- 32గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.2,150 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది మే నెలలో ఎల్‌ఐసీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూ (IREDA IPO)కు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఈడీఏనే.
ఈ పబ్లిక్ ఇష్యూ (IREDA IPO)లో ఐఆర్‌ఈడీఏ కొత్తగా 40.31 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. దీంతో రూ.1,290 కోట్ల సమీకరణ జరగనుంది. మరో రూ.860 కోట్లు విలువ చేసే 26.88 కోట్ల షేర్లను ‘ఆఫర్ ఫర్ సేల్’ కింద అందుబాటులో ఉంచనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ భవిష్యత్ మూలధన అవసరాలు, రుణ మంజూరుకు వినియోగించనుంది. ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో దాదాపు సగం ‘అర్హతగల సంస్థాగత మదుపర్ల (QII)’కు కేటాయించారు. మరో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, 15 శాతం ‘సంస్థాగతయేతర మదుపర్ల (NII)’కు రిజర్వ్ చేశారు. ఇన్వెస్టర్లు కనీసం 460 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,720 పెట్టుబడిగా పెట్టాలి.
ఐఆర్‌ఈడీఏ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న మినీరత్న కంపెనీ (కేటగిరీ-I). వివిధ దశల్లో ఉన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకులకు ఈ సంస్థ ఆర్థిక సహకారం అందజేస్తుంటుంది. ఈ క్రమంలో అనేక ఫండ్, నాన్-ఫండ్ ఆధారిత ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌లను అందిస్తోంది. బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ ఈ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.
2022- 23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన రూ.633 కోట్ల నుంచి రూ.864 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,128 కోట్ల నుంచి రూ.1,326 కోట్లకు పెరిగింది. 2023-24 ప్రథమార్ధంలో కంపెనీ నికర వడ్డీ ఆదాయం రూ.785 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.579 కోట్లుగా ఉంది. అదే సమయంలో కంపెనీ రూ.4,744 కోట్ల రుణాలు మంజూరు చేసింది.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
ఐపీఓ తేదీలు: నవంబరు 21-23
ఒక్కో షేరు ముఖ విలువ : రూ.10
ధరల శ్రేణి : రూ.30- 32
కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 460 (ఒక లాట్)
కనీస పెట్టుబడి: రూ.14,720 (గరిష్ఠ ధర వద్ద)
షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 29
రిఫండ్ల ప్రారంభ తేదీ : నవంబరు 30
డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 1
లిస్టింగ్ తేదీ : డిసెంబరు 4
👉 – Please join our whatsapp channel here –