Politics

భారాస హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం!

భారాస హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం!

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని.. ఆమె పరిపాలనే బాగుండుంటే ఎన్టీఆర్‌ తెదేపాను ఎందుకు పెడతారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి రూ.2లకే కిలో బియ్యం ఇచ్చాకే పేదల కడుపు నిండిందని అన్నారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలిపోయింది కాంగ్రెస్‌ హయాంలోనేనని ఈ సందర్భంగా కేసీఆర్‌ విమర్శించారు.

‘‘ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్‌ పార్టీ. దానికోసం 58 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను పిట్టలను కాల్చినట్లు కాల్చిపడేశారు. మలి దశ ఉద్యమంలో భారాస భాగమైంది. తెలంగాణ ఇస్తామంటే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాం. అయినా తెలంగాణ రాకపోయేసరికి ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేశాం. ఆ ఉద్యమంలో రసమయి బాలకిషన్‌లాంటి వాళ్లు భాగమై ధూంధాం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనేక పోరాటాల తర్వాత కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ తరువాత కూడా తెలంగాణ ఇవ్వడానికి వారికి మనసు రాలేదు. సకలజనుల సమ్మె అంటూ మళ్లీ ఉద్యమం చేస్తే గానీ తెలంగాణ సాకారం కాలేదు.

భారాస హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకొని పింఛన్లను పెంచుకుంటూ పోయాం. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇస్తున్నాం. సాగునీటి పథకాల కారణంగా పొలాలు కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. కరీంనగర్‌కు మీకు ఏదో లింకు ఉంది అని ఇటీవల మా కరీంనగర్‌ భీముడు గంగుల కమలాకర్‌ అన్నారు. పెళ్లి ఇక్కడే చేసుకున్న కాబట్టి లింకు ఉంది అన్నాను. అయితే.. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త పథకం ప్రకటిస్తున్నాను. అందుకే మళ్లీ భారాసకు అధికారం ఇస్తే ఆటోలకు ఫిట్‌నెస్‌ ఛార్జీ, సర్టిఫికెట్‌లకు అయ్యే ఖర్చును రద్దు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z