అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ.. చెప్పింది చేస్తది..చేసేదే చెప్తుందని అయన అన్నారు. కాంగ్రెస్, అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తోందని.. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించిందని మండిపడ్డారు.2023, నవంబర్ 20వ తేదీ సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోపై ప్రజల్లో ఆదరణ ఉందని.. పట్టణాలు, గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులకు నీరాజనం పలుకుతున్నారని.. బీజేపీకి యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో ఇసుక దందా రాజ్యమేలిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అవినీతిని పెంచిపోషించాయని విమర్శించారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు దోపిడి చేశారని.. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయిస్తామని అన్నారు. కోలుకోలేని విధంగా తెలంగాణ మూలాలను బీఆర్ఎస్ దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యమని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.
👉 – Please join our whatsapp channel here –