Politics

రాష్ట్రంలో ఊహించని రీతిలో బీజేపీకి మద్దతు

రాష్ట్రంలో ఊహించని రీతిలో బీజేపీకి మద్దతు

రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు కూలడం ఖాయమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష లు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పోవడం ఖాయం. మార్పు రావడం ఖాయం. బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది”అని కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం బీజేపీ మీడియా సెంటర్​లో విలేకరులతో మాట్లాడారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్​వి ఉత్త మాటలే
ఎస్సీ వర్గీకరణ కేసు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉన్నందునే స్పీడప్ చేసేందుకు ఫాస్ట్​ట్రాక్ మాదిరిగా ఓ కమిటీ వేశామే తప్ప, జాప్యం చేసేందుకు కాదని కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం అనుకూలమని కోర్టు ముందు చెప్పబోతున్నామన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మట్లేదన్నారు. కర్నాటకలో 5 గ్యారెంటీలకే దిక్కులేదు.. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయ్ కానీ, చేతలు మాత్రం గాంధీభవన్, ప్రగతిభవన్ దాటవని మండిపడ్డారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారని ధ్వజ మెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా..ఇలా అవినీతి కుంభకోణాలతో ఈ రెండు పార్టీలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాయని ఫర్ అయ్యారు. ఏడాదికి 3 నెలలు విదేశాల్లో బీచ్​లకు వెళ్లే రాహుల్ గాంధీ నీతులు చెప్పుడేందని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్ ప్రచార రథాలను అడ్డుకుంటున్నారని, నేతలపై తిరగవడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీలోపే జీతాలు ఇస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి రైతుకు ఉచితంగా దేశీయ ఆవును అందజేస్తామన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అంచనాలకు మించి బీజేపీకి మద్దతు లభిస్తోందన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవంలా చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజలు స్పందిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. అవినీతిరహిత పాలన అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు. హైవేలు అభివృద్ధి జరగాలంటే, విద్య, వైద్య వ్యవస్థ మెరుగుపడాలంటే, పెండింగ్ ప్రాజెక్టులు గట్టెక్కాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో భూములు అమ్మనిదే, లిక్కర్ షాపులు నడవనిదే ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z