త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో హోం ఓటింగ్ ప్రారంభమైంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 857 మందికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశమిచ్చింది. దీనికోసం మొత్తం 966 దరఖాస్తు చేసుకోగా.. 857 మందికి జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తెలిపారు.
ఆర్వోలు రెండు తేదీలను ఓటర్లకు చెప్పాల్సి ఉంటుంది. మొదటి తేదీన ఓటు వేయడం కుదరకపోతే, రెండో తేదీలో వేయొచ్చు. అదే సమయంలో సంబంధిత అధికారులు.. ఆయా ఓటర్లు, వారు ఓటు వేసే తేదీలను పోటీలోని అభ్యర్థులకు తెలియజేస్తారు. స్థానిక అధికారులు ఎన్నికల సామగ్రితో ఇంటివద్దకే వెళ్లి వారితో ఓటు వేయిస్తున్నారు.
సాధారణ పోలింగ్ కేంద్రం మాదిరే..
ఓటరు ఇంటికి అధికారులు వెళ్లి తాత్కాలిక గదిని ఏర్పాటు చేస్తారు. ఓటరు అందులోకి వెళ్లి బ్యాలెట్ పేపరుపై నచ్చిన అభ్యర్థికి ఓటు వేయొచ్చు. అనంతరం.. బ్యాలెట్ పేపరును చిన్నపాటి కవరు(ఫాం-13బీ)లో ఉంచి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే.. ఓటు వేసినట్లు ధ్రువీకరణపత్రంపై (ఫాం-13ఏ) ఓటరు సంతకం చేయాలి. ఆ రెండు ఫాంలను పెద్ద కవరులో(ఫాం-13సీ) వేసి, ఓటరు ముందే సీల్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పోలింగ్‌కు మూడు రోజుల ముందే (నవంబరు 27) పూర్తవ్వాలనే నిబంధన విధించారు.
👉 – Please join our whatsapp channel here