Devotional

క‌న్యాకుమారి: 23 నుండి వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

క‌న్యాకుమారి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

క‌న్యాకుమారిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో న‌వంబరు 23 నుంచి 25వ తేదీ వరకు ప‌విత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా న‌వంబరు 22న ఉద‌యం ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 గంట‌ల‌కు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయని వివరించారు.

23వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించనున్నామని, 24న పవిత్ర సమర్పణ, 25న సాయంత్రం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయని పేర్కొన్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

పవిత్రోత్సవాల సందర్భంగా న‌వంబ‌రు 23, 24వ తేదీల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తామని వెల్లడించారు.