Movies

ఆ దేశాల్లో మమ్ముట్టి సినిమా నిషేధం

ఆ దేశాల్లో మమ్ముట్టి సినిమా నిషేధం

మమ్ముట్టి- జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాథల్-ది కోర్‌’ (Kaathal – The Core). ఈ మలయాళ చిత్రంపై రెండు దేశాలు నిషేధం విధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. జీయో బేబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తాజాగా ఈ చిత్రాన్ని కువైట్‌, ఖతార్‌ దేశాలు బ్యాన్‌ చేశాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండడంతో.. ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ కేరళలోనూ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓ పత్రిక దీని కథా నేపథ్యాన్ని బయటపెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన జార్జ్‌ (మమ్ముట్టి) తన భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి నివసిస్తుంటాడు. అతడు పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్‌ వేస్తాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఓమన అతడి నుంచి విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. అదే గ్రామంలో డ్రైవింగ్‌ స్కూల్ నడుపుతోన్న ఓ స్నేహితుడితో జార్జ్‌ గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. జార్జ్‌ లైంగిక ధోరణిని తాను నేరంగా చూడడం లేదని.. కేవలం విడాకులు మాత్రమే కోరుతున్నట్లు చెబుతుంది. దీంతో అతడి పోటీపై సందిగ్ధత నెలకొంటుంది. అయితే, జార్జ్‌ మాత్రం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది..?జార్జ్‌ ఎన్నికల్లో పోటీ చేశాడా? వీరికి విడాకులు వచ్చాయా? అనేది మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ఇందులో చూపించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇది బయటకు రాగానే కువైట్‌, ఖతర్ దేశాలు ఈ సినిమాను తమ దేశంలో ప్రదర్శించడానికి వీల్లేదని పేర్కొన్నాయి. మరికొన్ని అరబ్‌ దేశాలు ఇదేబాటలో ఉన్నట్లు సమాచారం.

‘కాథల్-ది కోర్‌’ చిత్రం కోసం మమ్ముట్టి- జ్యోతిక మొదటిసారి కలిసి నటించారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. తాజాగా దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. ‘మమ్ముట్టి ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా, గౌరవంగా ఉంది’ అని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z