హీరోయిన్ త్రిషపై కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన్సూర్ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ త్రిషకు మద్దతు ప్రకటిస్తున్నారు. మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్ కుష్భూ అయితే ఏకంగా మహిళా కమీషన్ నుంచి కేసు కూడా నమోదు చేయించింది. టాలీవుడ్ నుంచే ఇప్పటికే హీరో నితిన్ ఈ వివాదంపై స్పందిస్తూ.. త్రిషకు మద్దతుగా నిలిచాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిష-మన్సూర్ వివాదంపై ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
‘త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ మహిళను ఉద్దేశించిన అనడానికి కూడా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి, త్రిష స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
అసలు మన్సూర్ చేసిన వ్యాఖ్యలేంటి?
లోకేశ్ కనగరాజ్-విజయ్ కాంబోలో వచ్చిన ‘లియో’చిత్రంలో మన్సూర్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. అందులో త్రిష హీరోయిన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మన్సూర్ మాట్లాడుతూ..‘గతంలో నేను ఎన్నో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’ ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో కూడా రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే.. నాకు అలాంటి సన్నివేశం లేదు. అందుకు బాధగా ఉంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడంతో.. మన్సూర్ వివరణ కూడా ఇచ్చాడు. తనకు త్రిషపై చాలా గౌరవం ఉందని.. సరదాగా మాట్లాడిన మాటలు..కొంతమంది కావాలనే వివాదస్పదం చేశారని ఆరోపించారు.
👉 – Please join our whatsapp channel here –