ఎన్నిక ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తార స్థాయికి తీసుకెళ్లనున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం బీజేపీ , కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి.
గతంలో ఎన్నడూ లేనట్లుగా బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 23తో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో వారు తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొంటారు. చివరి మూడు రోజులు రాజకీయ పార్టీలు హైదరాబాద్‌పై దృష్టి పెట్టాయి. బహిరంగసభలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. . 25న రాష్ట్రానికి వచ్చే ఆయన 27 వరకు ఇక్కడే ఉంటూ సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. 25న కామారెడ్డి, మహేశ్వరం; 26న తూప్రాన్, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రచారం 24, 26, 28 తేదీల్లో ఉంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత్‌బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక 24 నుంచి 28 వరకు ఇరవైకి పైగా సభల్లో పాల్గొంటారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పర్యటించే పది నియోజకవర్గాలను పార్టీ ఖరారు చేసింది. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు.
రాహుల్ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండనున్నారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు లేదా నాలుగు రోజులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 25న హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. 28న వరంగల్, గజ్వేల్ బహిరంగసభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
జనసేన, భాజపా అభ్యర్థులకు మద్దతుగా పవన్‌కల్యాణ్… జనసేన, భాజపా అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బుధవారం నుంచి సభల్లో పాల్గొంటారు. ఆ సభల్లో వరంగల్ వెస్ట్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూరు ఉన్నాయి. 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో అమిత్‌షాతో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు.
👉 – Please join our whatsapp channel here –