టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో 3,000కుపైగా ఉద్యోగాలను కల్పించనుంది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర ఆధునిక విభాగాలలో ప్రత్యేకతలున్న నిపుణులను ఎంపిక చేసుకోనున్నట్లు వివరించింది.
ఐదేళ్ల కాలంలో రూ. 1,00,000 కోట్ల బిజినెస్‌ను అందుకునే బాటలో ప్రయాణిస్తున్నట్లు టైటన్ తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా విభిన్న విభాగాలలో ప్రత్యేకత కలిగిన నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకునే వ్యూహాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ సొంత సిబ్బందిసహా.. వివిధ విభాగాలలో యువ వృత్తి నిపుణులను జత కలుపుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వృద్ధి, ఆవిష్కరణలతోపాటు పరిశ్రమలో కంపెనీ స్థానాన్ని పటిష్టపరచుకోనున్నట్లు టైటన్ హెచ్ఆర్(కార్పొరేట్, రిటైల్) హెడ్ ప్రియా ఎం.పిళ్లై పేర్కొన్నారు.
60:40
ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60 శాతం మెట్రో నగరాలలో సేవలందిస్తుండగా.. మరో 40 శాతం మంది ద్వితీయస్థాయి నగరాల(టైర్–2, 3)లో పనిచేస్తున్నట్లు టైటన్ వెల్లడించింది. వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాల పటిష్టతను కొనసాగిస్తూనే స్థానిక నిపుణులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) మధ్య భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –