* చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పై కేసు నమోదు
చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు నమోదైంది. సీఐ శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం రాత్రి సంతోష్‌నగర్ పీఎస్ పరిధిలోని మొయిన్‌బాగ్‌లో ఎంఐఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ బందోబస్తును పర్యవేక్షించడానికి వెళ్లిన సీఐ శివచంద్ర.. రాత్రి 10 గంటలు కావస్తుండటంతో స్టేజ్‌పైకి వెళ్లారు.సభకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండటంతో ఆ విషయాన్ని అక్బరుద్దీన్‌కు చెప్పేందుకు సీఐ ప్రయత్నించారు. అక్బరుద్దీన్ తనను చూసి… స్టేజ్ దిగి ఇక్కడి నుంచి వెళ్లాలని తన విధులకు ఆటంకం కలిగించారని సీఐ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
* రైలు నుంచి జారిపడి ఓ మహిళ
డోర్నకల్ – గార్ల రైల్వే స్టేషన్ ల మధ్యలో గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ మహిళ బుధవారం ఉదయం మృతి చెందింది.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకువీడు కు చెందిన మాసపు మాణిక్యం (53) ప్రమాదవశాత్తూ రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతురాలు వద్ద కరెంట్ బిల్ దొరకగా విచారణ జరిపి ఆమె కూతురుకు సమాచారం అందించినట్లు తెలిపారు. మతిస్థిమితం సరిగా లేక గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సహకారంతో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీకి తరలించినట్లు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter In Jammu Kashmir) ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, జమ్ము కశ్మీర్‌లో (Jammu and Kashmir) ఉగ్ర మూకలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై డాక్టర్, పోలీస్ సహా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిటల్ శ్రీనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడిసిన్) డాక్టర్ నిసారుల్ హసన్, కానిస్టేబుల్ (జమ్ము కశ్మీర్ పోలీస్) అబ్దుల్ మాజీద్ భట్, లేబరేటరీ బేరర్ అబ్ధుల్ సలాం రాదర్, టీచర్ ఫరూక్ అహ్మద్ మిర్‌లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.ఫరూక్ అహ్మద్ మిర్‌ను తొలుత 1994లో విద్యాశాఖలో నియమించగా ఆపై 2007లో టీచర్‌గా పదోన్నతి పొందారు. ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయడం, ఉక్కుపాదం మోపడమే తమ విధానమని, జమ్ము కశ్మీర్‌ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మలిచేందుకు ఎల్‌జీ యంత్రాంగం కట్టుబడి ఉందని ప్రభుత్వం పేర్కొంది.
* విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో-లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ కాగా.. క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్, లక్ష్య, చార్విక్, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంపై ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘‘ఉదయం 7గం.30ని. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆటోలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. వీళ్లంతా బేతని స్కూల్‌కు చెందిన వాళ్లు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’’ అని ఏసీపీ రాజీవ్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని పదో తరగతి చదివే హాసినిగా తెలుస్తోంది.
* గర్భిణి అయిన ఓ వివాహిత సూసైడ్
అత్తింటి వరకట్న వేధింపులు తాళలేక మూడు నెలల గర్భిణి అయిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఘటన హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి తల్లి వనిత తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా సీసీ నస్పుర్‌లో నివాసం ఉండే చీకటి వనిత కూతురు సాగరిక (25) హైదరాబాద్‌లోని జేబీఐటీలో చదువుతున్న సమయంలో గుడిమల్కపూర్ ప్రాంతానికి చెందిన గడ్డం సాయికాంత్ (29)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమక్షంలో సాగారిక, సాయి కాంత్ వివాహం జరిగింది.పెళ్లి సమయంలో కట్నంగా రూ.4 లక్షలు, 5 తులాల బంగారం ఇచ్చారు. వృత్తి రీత్యా ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కాగా గత కొన్ని రోజుల నుండి డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అత్త మామలు వరకట్నం తేవాలని నిత్యం వేధించే వారని.. దీపావళికి ఇంటికి వచ్చినపుడు ఈ విషయాన్ని తన కూతురు తనతో చెప్పుకుంటూ ఏడ్చిందని సాగరిక తల్లి ఆరోపించింది. తాము వచ్చి మాట్లాడతామని నచ్చచెప్పి అత్త వారింటికి పంపించింది. అయితే మాట్లాడదాం అనుకునే లోపే తన బిడ్డ ఇలా ఆత్మహత్య చేసుకుందని రోదిస్తూ తెలిపింది. తన బిడ్డ చావుకు కారణం అయిన భర్త గడ్డం సాయి కాంత్, అతని తల్లి , తండ్రిలపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. మృతురాలికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని ఆసిఫ్ నగర్ పోలీసులు తెలిపారు.
* స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ
విశాఖపట్నంలో స్కూల్ ఆటోలు ప్రమాదాలకు గురయ్యాయి. వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 20 మంది స్కూల్ విద్యార్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.. సంగం శరత్ థియేటర్ కూడలిలో స్కూల్ ఆటోను లారీని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఓ వైపు లారీ వేగంగా వస్తుండగా.. మరోవైపు, ఆటో డ్రైవర్ కూడా అంతే వేగంతో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.. లారీ దూసుకురావడంతో.. ఆటో కంట్రోల్ చేయలేక లేరుగా వెళ్లి ఢీకొట్టాడు.. ఈ ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బేతనీ స్కూల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన దెబ్బ తగిలిన ఇద్దరు పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. లారీని క్లీనర్ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేయగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇక, మధురవాడ, నగరపాలెం దగ్గర మరో స్కూల్ ఆటో బోల్తా పడింది. పందులు అడ్డుగా రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు పిల్లలకు దెబ్బలు తగిలాయి. వీరంతా భాష్యం స్కూల్ విద్యార్థులుగా చెబుతున్నారు స్థానికులు.. ఒకే రోజు రెండు చోట్ల అది కూడా స్కూల్ ఆటోలు ప్రమాదాలకు గురికావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
* ముంబై పోలీసులకు వ్యక్తి ఫోన్
రాబోయే అతి కొద్ది రోజుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఏదో పెద్ద సంఘటన జరగబోతోందంటూ ఓ వ్యక్తి పోలీసులకు (Mumbai Police) ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం తీవ్ర కలకలరం రేపుతోంది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తనను తాను షోయబ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ముంబై నగరంలో రాబోయే అతి కొద్ది రోజుల్లో ‘ఏదో పెద్ద సంఘటన’ జరగబోతోందంటూ (Something big will happen in Mumbai soon) చెప్పాడు. గుజరాత్‌కు చెందిన సమా అనే మహిళ.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆసిఫ్ అనే వ్యక్తితో కలిసి ముంబైలో ఏదో పెద్ద ఘటనకు ప్లాన్ చేసిందని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోన్ నంబర్లను కూడా పోలీసులకు ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* కర్ణాటక బెంగుళూరులో దారుణ ఘటన
కర్ణాటక బెంగుళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది.. తన కూతురిని వేధిస్తున్నాడన్న ఆరోపణతో 21 ఏళ్ల యువకుడిని హత్య చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.. బాధితుడిని విల్సన్ గార్డెన్‌లో ఫుడ్ డెలివరీ చేస్తున్న డేవిడ్‌గా గుర్తించారు..వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆనేపాల్యలో నివసిస్తున్న మంజునాథ్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి ముగ్గురు పిల్లలు.. అతని రెండో కుమార్తె తో డేవిడ్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు.. అతన్ని గత కొద్ది రోజులుగా ఫాలో అవుతూ వచ్చాడు.. ఇటీవల మంజునాథ్ వీరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించి మంజునాథ్‌ను హెచ్చరించాడు. తన కూతురితో సంబంధం కొనసాగించవద్దని సలహా కూడా ఇచ్చాడు. అయినప్పటికీ, డేవిడ్ ఆమెకు ఫోన్‌లో కాల్ చేస్తూనే ఉన్నాడు.. తనతో శారీరకంగా కలవకుంటే ఇద్దరం కలిసిన ఫోటోలను తన, ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు..ఈ విషయాన్ని వెంటనే తన తండ్రికి చెప్పింది.. అతని తీరు మారలేదని మళ్లి రమ్మని బెదిరిస్తున్నట్లు ఆదివారం తన తండ్రికి చెప్పింది.. అతనికి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు మంజునాథ్.. కానీ వినలేదు.. దాంతో సుబ్బన్న గార్డెన్ సమీపంలో డేవిడ్‌ను కలవాలని మంజునాథ్ కోరాడు. కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో గొడవ జరిగి మజునాథ్ డేవిడ్‌పై కత్తితో దాడి చేశాడు.. తీవ్ర రక్త స్రావం కావడం తో అక్కడిక్కడే మృతి చెందాడు… స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి మంజునాథ్ ను అదుపులోకి తీసుకున్నారు..ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
👉 – Please join our whatsapp channel here –