కాంగ్రెస్, భారాసపై కేంద్రమంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా?అని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్.. తన కుమారుడు సీఎం అవుతారని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి మారతారని విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కాంగ్రెస్ కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు. ప్రజలు భాజపాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మెడికల్ కళాశాలల కోసం వంద ఉత్తరాలు రాసినట్టు చెబుతున్న కేసీఆర్.. ఆ ఉత్తరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్‌రోడ్డు ఎందుకు ఆలస్యమవుతోందో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
👉 – Please join our whatsapp channel here –