యుద్ధం కొనసాగుతున్న గాజా, ఇజ్రాయెల్‌లోని ఆస్పత్రులకు బిలియనీర్ ఎలాన్ మస్క్ విరాళం ప్రకటించారు. తన నేతృత్వంలోని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో యుద్ధానికి సంబంధించిన సమాచారం కారణంగా లభిస్తున్న వాణిజ్య ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్ల ఆదాయాన్ని అందుకోసం కేటాయించనున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ ద్వారా వీటిని ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిధులను ఎలా ఉపయోగిస్తున్నారో ఎప్పటికప్పుడు ఆరా తీస్తామని స్పష్టం చేశారు. ఈ ఫండ్స్ హమాస్ చేతికి చిక్కకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. జాతి, వర్గం, మతం సహా ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా అమాయకులను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఎలాంటి సలహాలు ఇచ్చినా స్వాగతిస్తామని తెలిపారు.
హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో గాజాలో సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆస్పత్రులు సహా ఇతర అత్యసవర సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సహాయ కార్యక్రమాల్లో నిమగమ్నమైన సంస్థలకు స్టార్‌లింక్ సేవలను అందిస్తామని మస్క్ గత నెలలో ప్రకటించారు.ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో ప్రారంభమైన యుద్ధం గత ఆరు వారాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమవారిని విడిపించడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ భూతల దాడులు జరుపుతోంది. ఇప్పటి వరకు ఈ పోరులో వేలాది మంది మరణించారు. హమాస్ మూకలు ఆసుపత్రుల్లో దాక్కొని దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ సైన్యం అనివార్య పరిస్థితుల్లో ఆసుపత్రుల్లోకీ ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. తాజాగా 50 మంది బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది.
👉 – Please join our whatsapp channel here –