గుర్తింపు పొందిన బోర్డుల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయో టెక్నాలజీతోపాటు అదనపు సబ్జెక్టుగా ఇంగ్లిషుతో 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నీట్-యూజీ పరీక్షకు అర్హులవుతారని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన విద్యార్థులకు సైతం ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు 11, 12 తరగతుల్లో రెండేళ్లు కచ్చితంగా ఇంగ్లిషుతోపాటు పై సబ్జెక్టులను క్రమం తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలని ఎన్‌ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నోటీసులో పేర్కొంది.
సిలబస్ తగ్గింపు
నీట్-యూజీలో పాఠ్యాంశాలను తగ్గిస్తున్నట్లు జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ) వెల్లడించింది. సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా నీట్-యూజీలోనూ సిలబస్‌ను హేతుబద్ధీకరించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది మే 5న నిర్వహించే పరీక్షలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవీకరించిన పాఠ్యాంశాల కోసం నీట్ వెబ్‌సైట్‌ను చూడాలని విద్యార్థులు, విద్యాసంస్థలను కోరింది.
👉 – Please join our whatsapp channel here –