Sports

ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెంబర్ వన్

ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెంబర్ వన్

ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ అగ్రస్థానం కైవసం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సహా 9 పతకాలతో భారత్‌ పట్టికలో ప్రథమ స్థానం సాధించింది. దక్షిణ కొరియా అయిదు పతకాల (3-1-1)తో రెండో స్థానంలో నిలిచింది. పురుషుల కాంపౌండ్‌ ఓపెన్‌ విభాగంలో రాకేశ్‌ స్వర్ణంతో మెరిశాడు. పురుషుల డబుల్స్‌లో రాకేశ్‌- సూరజ్‌సింగ్‌ జోడీ బంగారు పతకం గెలుచుకుంది. మిక్స్‌డ్‌ టీమ్‌లో రాకేశ్‌- శీతల్‌ దేవి జంట స్వర్ణం నెగ్గింది. మహిళల కాంపౌండ్‌ ఓపెన్‌ టీమ్‌లో శీతల్‌, జ్యోతి భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు.

షూటింగ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌: పతక రేసులో గనేమత్‌

దోహా: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ షూటింగ్‌ టోర్నీలో యువ క్రీడాకారిణి గనేమత్‌ షెఖాన్‌ పతకంపై ఆశలు నిలిపింది. మహిళల స్కీట్‌ షూటింగ్‌లో అర్హత రౌండ్లో గనేమత్‌ రెండో స్థానం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ క్వాలిఫయింగ్‌లో పురుషుల విభాగంలో హృదయ్‌ హజారిక, మహిళల్లో ఇలవెనిల్‌ ఏడో స్థానాల్లో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

లక్ష్య, శ్రీకాంత్‌ ఓటమి

షెన్‌జెన్‌: చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నీ నుంచి భారత ఆటగాళ్లు లక్ష్యసేన్‌, శ్రీకాంత్‌ నిష్క్రమించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్య 19-21, 18-21తో షై యుకి (చైనా) చేతిలో, శ్రీకాంత్‌ 15-21, 21-14, 13-21తో కున్లావత్‌ వితిద్సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూశారు. వరుసగా మూడో టోర్నీలో శ్రీకాంత్‌ తొలి రౌండ్లోనే ఓడటం గమనార్హం. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు కోసం ప్రయత్నిస్తున్న 24వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌కు ఇది ప్రతికూలాంశమే. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28లోపు టాప్‌-16 ర్యాంకింగ్‌లో అడుగుపెడితేనే శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌ రేసులో ఉంటాడు. మరో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్‌ 17-21, 14-21తో కెంటా నిషిమొటొ (జపాన్‌) చేతిలో ఓడాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z