NRI-NRT

టెక్సాస్‌లో హఠాత్తుగా కూలిన విమానం

టెక్సాస్‌లో హఠాత్తుగా కూలిన విమానం

అమెరికాలోని ఓ షాపింగ్‌ సెంటర్‌ సమీపంలో ప్రమాదం చోటు చేసుకొంది. చిన్న విమానం కూలిపోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పైలట్‌ మృతి చెందాడు. ఈ ఘటన టెక్సాస్‌లో మంగళవారం చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..టెక్సాస్‌ ప్లానోలోని ఒక షాపింగ్‌ సెంటర్‌ పార్కింగ్‌లో హఠాత్తుగా ఓ చిన్న విమానం (సింగిల్ ఇంజిన్ మూనీ M20) కుప్పకూలింది. వెంటనే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పైలట్‌గా గుర్తించారు. అంతేకాకుండా పార్కింగ్‌ స్థలంలో ఉన్న కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి.

కాగా.. ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఎయిర్‌పోర్టు ఉంది. అయితే, ఈ విమానం టేకాఫ్‌ లేదా ల్యాండింగ్‌ సమయంలో ఈ ప్రమాదం సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) దర్యాప్తు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.ఇటీవల టెక్సాస్‌ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో కూడా ఓ బుల్లి లాన్సర్‌ Iv-P ప్రాప్‌జెట్‌ విమానం రన్‌వే పై నుంచి అదుపుతప్పి రోడ్డపై వెళుతున్న కారును ఢీకొన్న విషయం తెలిసిందే. అమెరికాలో గత కొన్నేళ్లుగా చిన్న విమానాల ప్రమాదాల సంఖ్య భారీగానే ఉంటోంది. 2019లో 988 ప్రమాదాలు జరగ్గా.. 307 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2021లో 939 ప్రమాదాలు చోటుచేసుకోగా.. 268 మంది చనిపోయారు. ప్రధానంగా రన్‌వేపై దిగే సమయంలో నియంత్రణ కోల్పోవడమే ప్రమాదాలకు ముఖ్య కారణంగా నిలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z