DailyDose

వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు విడుదల

వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు విడుదల

చదువులకు మరింత ఊతమిస్తూ వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించడానికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో
పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించారు. వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.348.84 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

దాదాపు రెండింతల సాయం..
* గత ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి రూ.68.68 కోట్లు ఎగ్గొట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచింది.

* ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.40,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000.

* కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సా­యం రూ.75,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1,20,000 సాయం చేస్తోంది.

* ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50,000 కాగా, ఈ ప్రభుత్వం రూ.1,00,000 అందిస్తోంది.

* బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.35,000 కాగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.50,000 అందిస్తోంది.

* కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సా­యం రూ.50,000 కాగా, ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.75,000.

* కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1,20,000 సాయం అందిస్తోంది.

* మైనార్టీలు, దూదేకులు, నూర్‌ బాషాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50,000 కాగా, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000.

* విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.1,00,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దానిని రూ.1,50,000లకు పెంచింది.

* భవన, ఇతర నిర్మాణ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.20,000 కాగా, దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.40,000లకు పెంచింది.