ఇరవై ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ వచ్చింది. మదుపరులు ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభమయింది. నవంబర్ 24తో సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 22వ తేదీన 4,50,29,207 (నాలుగున్నర కోట్లు) షేర్లను అందుబాటులో ఉంచగా ఐపీఓ మొదలైన గంటలోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
టాటా మోటార్స్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్, టాటా మోటార్స్ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్ చేశారు.
టాటా టెక్నాలజీస్ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం ఉదయం 11 గంటలకు 8,73,22,890 బిడ్లు దాఖలయ్యాయి. అంటే 1.94 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు తెలుస్తోంది. కేటగిరీ వారీగా నాన్ ఇన్‌స్టిట్యూషనల్ మదుపర్లు 2.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ మదుపర్ల 1.98 రెట్లు, రిటైల్ విభాగంలో 1.63 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి టాటా టెక్ రూ.791 కోట్లు సమీకరించింది.
👉 – Please join our whatsapp channel here –