వ్యక్తిగత రుణాలపై రిస్క్ వెయిట్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమర్థించుకున్నారు. సుస్థిరత సాధించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకునే గృహ, వాహన రుణాలను అందులోంచి మినహాయించినట్లు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FICCI), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సుస్థిరత సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ముందస్తుగా అన్‌సెక్యూర్డ్ రుణాలపై నిర్ణయం తీసుకున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడీ లేదని, అయినప్పటికీ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోందని చెప్పారు. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ అధికంగా ఉన్నప్పటికీ.. రూపాయి స్వల్ప స్థాయిలోనే ఒత్తిడిని ఎదుర్కొందన్నారు. దేశీయంగా రూపాయి విలువ క్షీణించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధరల ఒత్తిడిని అధిగమించాలంటే అగ్రికల్చర్ మార్కెటింగ్‌లో సంస్కరణలు అవసరం అని అభిప్రాయపడ్డారు.
వ్యక్తిగత రుణాల విషయంలో ఆర్‌బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఈ తరహా రుణాలిచ్చేందుకు ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. హామీలేని వ్యక్తిగత రుణాలకు రిస్క్ వెయిట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ సవరించిన నిబంధనలు గృహ, విద్య, వాహన రుణాలను ఇందులోంచి మినహాయించింది. పసిడి, పసిడి ఆభరణాల తనఖాపై తీసుకునే రుణాలకూ వర్తించవని స్పష్టం చేసింది. అలాగ, క్రెడిట్ కార్డు రుణాల విషయంలోనూ రిస్క్ వెయిట్‌ను 25 పర్సెంటేజీ పాయింట్లు పెంచి ప్రస్తుత 125 శాతం నుంచి 150 శాతానికి ఆర్‌బీఐ చేర్చింది.
👉 – Please join our whatsapp channel here –