ScienceAndTech

అమెరికా టెక్‌ రంగంలో మరో భారీ డీల్‌

అమెరికా టెక్‌ రంగంలో మరో భారీ డీల్‌

అమెరికా టెక్నాలజీ సెక్టార్‌లో ఓ భారీ డీల్‌ జరిగింది. కంప్యూటర్‌ చిప్స్‌ తయారీ సంస్థ బ్రాడ్‌కామ్‌ (Broadcom) 69 బిలియన్‌ డాలర్లు (రూ.5.7లక్షల కోట్లు) వెచ్చించి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ వీఎంవేర్‌ను హస్తగతం చేసుకొంది. ప్రపంచ వ్యాప్తంగా పలు రెగ్యులేటరీలు ఈ డీల్‌కు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. ఇక చైనా రెగ్యులేటరీ నుంచి ఈ డీల్‌కు ఆమోదం ఇప్పించడంలో అమెరికా చురుగ్గా వ్యవహరించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భేటీ జరిగింది. అది పూర్తయిన తర్వాత చైనా నుంచి బ్రాడ్‌కామ్‌-వీఎంవేర్‌ డీల్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో సాన్‌జోస్‌ ప్రధాన కేంద్రంగా బ్రాడ్‌కామ్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. సెమీకండక్టర్ల డిజైన్‌, డెవలప్‌మెంట్‌, పంపిణీతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సాఫ్ట్‌వేర్‌ సేవలు కూడా అందిస్తుంది. ఇక వీఎంవేర్‌ పాలో ఆల్టో కేంద్రంగా పనిచేస్తోంది. ఇది వర్చువల్‌ స్టేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తుంది. ఇవి ఒక కంప్యూటర్‌లో వర్చువల్‌గా మరో కంప్యూటర్‌ను నడిపించగలవు. ఇవి కంప్యూటర్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. ఈ రెండు సంస్థల విలీనానికి ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణ కొరియా, దక్షిణ ఆఫ్రికా, తైవాన్‌, యూకే అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో వీఎంవేర్‌ షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేశారు.

ఇక బ్రాడ్‌కామ్‌కు చైనాతో, హువావే టెక్నాలజీస్‌తో మంచి సంబంధాలున్నాయి. తొలుత సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఆ తర్వాత అమెరికాకు ప్రధాన కార్యాలయాన్ని మార్చింది. ఈ సంస్థ 2017లో టెక్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌ను దాదాపు 117 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు డీల్‌ను ప్రకటించింది. కానీ, ట్రంప్‌ సర్కారు దీనికి అనుమతించేందుకు తిరస్కరించింది. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా అధికారులు కూడా ఈ డీల్‌తో చైనా లబ్ధిపొందుతుందని వెల్లడించారు. ఈ డీల్‌ 5జీ టెక్నాలజీ రేసులో అమెరికాను దాటేసేందుకు చైనాకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z