Business

ఎక్స్‌’లో మరో మార్పు- వాణిజ్య వార్తలు

ఎక్స్‌’లో మరో మార్పు- వాణిజ్య వార్తలు

*   మొబైల్ రీఛార్జ్‌లపై ఎక్స్‌ట్రా చార్జీలు వ‌సూలు

క‌న్వీనియ‌న్స్ ఫీ పేరుతో గూగుల్ పే వినియోగ‌దారుల‌పై భారం మోపింది. త‌మ యాప్ యూపీఐ స‌ర్వీస్ ద్వారా మొబైల్ ఫోన్ల రీచార్జ్ చేసుకునే యూజ‌ర్ల‌పై రూ. 3 చొప్పున గూగుల్ పే (Google Pay)  నూత‌న చార్జి విధిస్తోంది. గ‌తంలో ఈ త‌ర‌హా లావాదేవీలపై ఎలాంటి ఫీజును గూగుల్ పే వ‌సూలు చేయ‌లేదు. ఇక తాజా వ‌డ్డింపుతో యూజ‌ర్లు గూగుల్ పే ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్‌ల‌ను కొనుగోలు చేస్తే ఈ ఫీజు వ‌ర్తిస్తుంది.ఈ త‌ర‌హా లావాదేవీల‌కు పేటీఎం, ఫోన్‌పే ఇప్ప‌టికే చార్జీలు వ‌సూలు చేస్తుండ‌గా గూగుల్ పే సైతం వాటి స‌ర‌స‌న చేరింది. త‌న పేమెంట్ యాప్‌పై క‌న్వీనియ‌న్స్ ఫీజును వ‌సూలు చేస్తున్నా గూగుల్ ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ఫీజు వ‌సూలుపై నోరు మెద‌ప‌లేదు. జియో నుంచి రూ. 749 ప్రీపెయిడ్ రీచార్జ్‌పై రూ. 3 క‌న్వీనియ‌న్స్ ఫీ వ‌సూలుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఓ క‌స్ట‌మ‌ర్ షేర్ చేయ‌డంతో యూజ‌ర్ల‌కు ఈ అప్‌డేట్ విష‌యం తెలిసింది.ఈ ఫీజు యూపీఐ, కార్డు లావాదేవీల‌కు వ‌ర్తిస్తుంది. రూ. 100లోపు రీచార్జ్ ప్లాన్‌ల‌పై క‌న్వీనియ‌న్స్ ఫీ వ‌ర్తించ‌ద‌ని, రూ 100పైబ‌డిన రీచార్జ్ ప్లాన్‌లపైనే ఈ ఫీజు వ‌ర్తిస్తుంద‌ని టెక్ నిపుణులు ముకుల్ శ‌ర్మ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

*   ఎక్స్‌’లో మరో మార్పు

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌కు చెందిన ‘ఎక్స్‌’లో వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గతంలోలాగాఎక్స్‌లో షేర్‌ చేసే లింక్స్‌కు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించేలా తిరిగి మార్పులు చేయనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఇకపై ఇమేజ్‌లపైనే లింక్‌ హెడ్‌లైన్‌ కనిపిస్తుందని చెప్పారు.ఈ హెడ్‌లైన్‌ ఆప్షన్‌కు సంబంధించి ఎలాన్‌ మస్క్‌ ఇతర వివరాలను వెల్లడించలేదు. లింక్‌ ప్రివ్యూలకు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించకుండా ‘ఎక్స్‌’లో అక్టోబరులో మార్పులు చేశారు. నెలలోపే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు ప్రకటించారు. అక్టోబరులో చేసిన మార్పు ప్రకారం.. ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన అంశంలోని విషయం తెలుసుకోవడానికి లీడ్‌ ఇమేజ్‌ పైభాగంలో ఉండే లింక్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో పోస్ట్‌ చేసే వినియోగదారులు ఇమేజ్‌పైనే హెడ్‌లైన్‌ను రాసేవారు. వినియోగదారులు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లోనే ఎక్కువ సమయం వెచ్చించేలా మార్పులు చేసినట్లు తెలిసింది. ఇమేజ్‌పై హెడ్‌లైన్‌ కనిపించడం వల్ల దృష్టి దానిపైకి మళ్లి యూజర్లు లింక్‌పై క్లిక్‌ చేసి ప్లాట్‌ఫామ్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. లింక్స్‌ను కాకుండా నేరుగా కంటెంట్‌నే పోస్ట్‌ చేయాలని మస్క్‌ చెబుతున్నట్లు సమాచారం. దాంతో ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతుందని అధికారులు చెప్పారు.

* టెక్నికల్ సమస్యతో మొరాయించిన ఐఆర్సీటీసీ

రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటైన ఐఆర్సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో సాంకేతిక లోపంతో గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. ఫలితంగా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. తత్కాల్ సమయంలో యూజర్లు పలు ఇబ్బందుల పాలయ్యారు. కొన్ని గంటల తర్వాత యూజర్లకు సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు అధికారికంగా వచ్చాయని ఐఆర్సీటీసీ తన అఫిషియల్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.తాము రైలు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని పేర్కొంటూ గురువారం ఉదయం నుంచి పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికలపై పోస్టులు పెట్టారు. టికెట్ బుక్ చేస్తుంటూ ఎర్రర్ అని మెసేజ్ వస్తున్నదంటూ.. స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. టికెట్లు బుక్ చేసినప్పుడు మెయింటెనెన్స్ కారణంగా ఈ-టికెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని ఎస్ఎంఎస్ వస్తున్నదని పేర్కొన్నారు. ఐఆర్సీటీసీ యాప్‌లో ‘అనేబుల్ టు కనెక్ట్’ అనే మెసేజ్ వస్తుందని యూజర్లు తమ పోస్టుల్లో తెలిపారు.దీనిపై ఐఆర్సీటీసీ రియాక్టయింది. సాంకేతిక కారణాలతో ఈ-టికెట్ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడిందని ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన తర్వాత మధ్యాహ్నం 1.55 గంటలకు తమ సేవలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయని ఐఆర్సీటీసీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. కానీ, సాంకేతిక లోపం ఏమిటన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.

మరో కొత్త బైక్‌ను విడుదల

విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ప్యూర్‌ ఈవీ (Pure EV) కొత్తగా ఎకోడ్రిఫ్ట్‌ 350 (ecoDryft 350) పేరిట ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీంట్లో 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపర్చారు. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్‌షోరూం). ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 171 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.ఆరు ఎంసీయూలు ఉన్న 3 kW (4 bhp) ఎలక్ట్రిక్‌ మోటార్‌తో ఎకోడ్రిఫ్ట్‌ 350 (ecoDryft 350) వస్తోంది. ఈ మోటార్‌ 40 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్‌ గరిష్ఠ వేగం 75 kmph అని కంపెనీ తెలిపింది. అవసరానికి అనుగుణంగా మొత్తం మూడు రైడింగ్‌ మోడ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.ఈ ఎకోడ్రిఫ్ట్‌ 350 (ecoDryft 350)లో రివర్స్‌ మోడ్‌, కోస్టింగ్‌ రీజెన్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, డౌన్‌ హిల్‌ అసిస్ట్‌, పార్కింగ్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ లైఫ్‌ పెరిగేలా స్మార్ట్‌ ఏఐ ఫీచర్‌ను కూడా ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్యూర్‌ ఈవీ ఈ బైక్‌పై ఈఎంఐ ఆప్షన్‌ను కూడా ఇస్తోంది. రూ.4,000 నెలవారీ ఈఎంఐతో ఈ బైక్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం కంపెనీ హీరోఫిన్‌కార్ప్‌, ఎల్అండ్‌టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 100 విక్రయ కేంద్రాల్లో ఈ బైక్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది.తమ విశ్వసనీయ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో భాగంగానే ఎకోడ్రిఫ్ట్‌ 350 (ecoDryft 350)ని తీసుకొచ్చామని ప్యూర్‌ఈవీ సీఈఓ రోహిత్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్‌లో ప్రయాణికుల అనుభూతిని ఇది మారుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 110 సీసీ సెగ్మెంట్‌కు ప్రత్యామ్నాయంగానే దీన్ని తీసుకొచ్చామని వెల్లడించారు.

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌నోట్‌లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 66,084.37 పాయింట్లతో వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ఇంట్రాడేలో 66,235.24 గరిష్ఠాన్ని తాకగా.. 65,980.50 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 5.43 పాయింట్ల నష్టంతో 66,017.81 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 9.85 పాయింట్ల పతనమై 19,802 వద్ద ముగిసింది.హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా నిలువగా.. సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్ అండ్ టూబ్రో నష్టపోయాయి. హెల్త్‌కేర్ ఇండెక్స్ ఒక శాతం తగ్గింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతంతో ముగిసింది. రియాల్టీ, చమురు అండ్‌ గ్యాస్ ఒక్కొక్కటి శాతం, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z