టెక్ దిగ్గజం మెటాకు చెందిన సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ (Instagram) మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. పబ్లిక్ రీల్స్‌ని నేరుగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని తన యూజర్లకు కల్పించింది. గ్లోబల్‌గా ఈ ఫీచర్‌ని లాంచ్ చేసినట్లు ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి వెల్లడించారు.
ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇతర ఫ్లాట్‌పామ్‌లపై ఆధారపడాల్సి ఉండేది. ఇకపై అలాంటి అవసరం లేకుండా సులువుగా యాప్‌లో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా వీడియో కింద ఉండే షేర్ ఆప్షన్ వద్దనే ఈ డౌన్లోడ్ ఆప్షన్‌ను ఉంచనుంది. దీంతో అన్ని పబ్లిక్ అకౌంట్లలో పోస్ట్ చేసే రీల్స్, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ డౌన్లోడ్ ఆప్షన్‌ను నియంత్రించే అధికారం కేవలం పబ్లిక్ అకౌంట్ హోల్డర్లకు మాత్రమే కల్పించింది. పబ్లిక్ ఖాతాలు నడిపే వారు పోస్ట్ చేసే రీల్స్‌లో నచ్చిన వాటికి మాత్రమే ఈ ఆప్షన్‌ను జత చేయొచ్చనమాట. అయితే 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారి ఖాతాలకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.
ఎనేబల్ ఇలా..మీరు ఎడిట్ చేసిన రీల్స్‌ని ఎంచుకొని ‘Next’ పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌ను కిందకు స్క్రోల్ చేయగానే ‘Advanced Settings’ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడే ‘Allow people to download your reels’ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొనేందుకు అనుమతి ఇవ్వదలచుకుంటే ఆ ఆప్షన్‌ను ఎనేబల్ చేసుకోవాలి. అంతే ఇక ఎప్పటిలానే రీల్‌ను పోస్ట్ చేయొచ్చు. ఇలా ప్రతి రీల్‌ని పోస్ట్ చేసుకొనే ముందు డౌన్లోడ్ పర్మిషన్ను ఎంచుకొనే సదుపాయాన్ని ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ రోల్ అవుట్ అవుతోంది.. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
👉 – Please join our whatsapp channel here –