గూఢచర్యం (Espionage) ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష (Death Sentence) విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ భారత ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను విచారించేందుకు తాజాగా ఖతార్ కోర్టు అంగీకరించింది. అప్పీల్‌ను పరిశీలిస్తున్నామని, త్వరలో దీనిపై విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.
గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాలపై ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను గతేడాది ఆగస్టులో అక్కడి నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారంటూ వారిపై అభియోగాలు మోపినట్లు అక్కడి ప్రభుత్వ ఆధ్వరంలో నడిచే అల్-జజీరా పత్రిక వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎనిమిది మంది భారతీయులకు అక్కడి న్యాయస్థానం అక్టోబర్ చివరి వారంలో మరణశిక్ష విధించింది. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం.. అత్యంత ప్రాముఖ్యత గల ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. దానిలో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఖతార్(Qatar)లో అప్పీల్ దాఖలు చేసింది. వారి విడుదలకు అవసరమైన చట్టపరమైన మార్గాలపై మన విదేశాంగశాఖ దృష్టి సారించినట్లు చెప్పింది.
వాస్తవానికి మన నౌకాదళ మాజీ అధికారులను రక్షించుకోవడానికి పరిమిత మార్గాలున్నాయి. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవడం వీటిల్లో ఒకటి. ప్రస్తుతం విదేశాంగ శాఖ, న్యాయనిపుణులు దీనిపైనే పనిచేస్తున్నారు. ఇక అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాటం చేసే అవకాశాలూ ఉన్నాయి. అయితే.. ఇది చివరి మార్గంగా ఎంచుకొవచ్చనే వాదనలున్నాయి. పాక్‌లో చిక్కుకుపోయిన కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్ ఈ మార్గంలోనే పోరాడింది. ఇక దౌత్యమార్గం అన్నిటికంటే ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశ ఉన్నత నాయకత్వం ఖతార్ పాలకుడి వద్ద ఈ కేసును ప్రస్తావించి క్షమాభిక్ష ఇప్పించడం ప్రధానమైంది. రంజాన్, ఖతార్ నేషనల్ డే (డిసెంబర్ 18) వంటి ప్రత్యేకమైన రోజుల్లో ఆ దేశ పాలకుడు వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష తగ్గింపు, క్షమాభిక్ష వంటివి చేస్తుంటారు.
ఖతార్‌లో విదేశీయులకు అధికంగా మృత్యుదండన విధిస్తున్నట్లు గత ఏడాది ఓ సర్వే వెల్లడించింది కూడా. 2016-21 మధ్యలో 21 మందికి ఈ శిక్ష విధించగా.. వారిలో హత్యలు, మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టయిన 18 మంది విదేశీయులున్నారు.
👉 – Please join our whatsapp channel here –