క్రెడిట్ కార్డుల్ని వాడాలంటే జాయినింగ్ ఫీజుతో పాటు, రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడినా వాడకపోయినా ఈ రుసుములు చెల్లించాల్సిందే. అయితే, కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుల్ని ఉచితంగా అందిస్తున్నాయి. కార్డులపై ఎలాంటి వార్షిక రుసుము గానీ, రెన్యువల్ ఫీజులు గానీ వసూలు చేయడం లేదు. అంటే ఈ కార్డులు లైఫ్ టైమ్ ఫ్రీ అన్నమాట. ఆ కార్డులు, వాటిపై ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
షాపర్స్ స్టాప్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ (HDFC shoppers stop credit card)
ప్రైవేటురంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC Bank) షాపర్స్ స్టాప్ క్రెడిట్ కార్డుని లైఫ్‌టైమ్ ఫ్రీగా అందిస్తోంది. ఇంధనం మినహా షాపర్స్ స్టాప్ బ్రాండ్లు, ఇతర కేటగిరీలపై చేసే ప్రతి రూ.150 ఖర్చుకి ఆరు ఫస్ట్ సిటిజెన్ పాయింట్లు పొందొచ్చు. ఒక నెలలో గరిష్ఠంగా 500 ఫస్ట్ సిటిజన్ పాయింట్లు సంపాదించొచ్చు. ఇతర కొనుగోళ్లపై 2 ఫస్ట్ సిటిజన్ పాయింట్లు లభిస్తాయి. ఒక ఫస్ట్ సిటిజెన్ పాయింట్ 60 పైసలతో సమానం.
యాక్సిక్ బ్యాంక్ (Axis Bank My Zone Credit Card)
యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్ కూడా లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. స్విగ్గీలో ఒక్కో ఆర్డర్‌పై రూ.120పై డిస్కౌంట్ పొందొచ్చు. నెలకు రెండు సార్లు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతి రూ.200 ఖర్చుపై 4 ఎడ్జ్ (EDGE) రివార్డ్ పాయింట్లు పొందొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ (Amazon Pay ICICI Bank Credit Card)
జాయినింగ్ ఫీజు, ఎలాంటి వార్షిక రుసుమూ లేకుండానే ఐసీఐసీఐ బ్యాంక్-అమెజాన్ కో బ్రాండ్ క్రెడిట్ కార్డును జారీ చేస్తోంది. ఈ కార్డుతో అమెజాన్ కొనుగోళ్లపై ప్రైమ్ వినియోగదారులకు 5 శాతం, నాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 3 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఇక డిజిటల్, గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లపై 2 శాతం, అన్ని రకాల ఇతర లావాదేవీలపై 1 శాతం చొప్పున క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఒక్కో రివార్డు పాయింట్.. ఒక్కో రూపాయితో సమానం. అమెజాన్ పే బ్యాలెన్స్‌లో ఈ మొత్తం యాడ్ అవుతుంది.
ఐసీఐసీఐ ప్లాటినమ్ చిప్ క్రెడిట్ కార్డ్ (ICICI Platinum Chip Credit Card)
ఐసీఐసీఐ ప్లాటినమ్ చిప్ క్రెడిట్ కార్డుతో ఇంధనం మినహా అన్ని రిటైల్ కొనుగోళ్లపై చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 2 రివార్డ్ పాయింట్లు పొందొచ్చు. యుటిలిటీస్, ఇన్సూరెన్స్ కేటగిరీలపై ప్రతి రూ.100 ఖర్చుపై 1 రివార్డ్ పాయింట్ లభిస్తుంది. హెచ్‌పీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద రూ.4 వేల వరకు ఇంధన కొనుగోలుపై 1 శాతం సర్‌ఛార్జీ మినహాయింపు పొందొచ్చు.
కోటక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్ (811 #DreamDifferent Credit Card)
ఎలాంటి వార్షిక రుసుము, జాయినింగ్ ఫీజు లేకుండానే కోటక్ మహీంద్రా 811 డ్రీమ్ డిఫరెంట్ పేరిట క్రెడిట్ కార్డును మంజూరు చేస్తోంది. ఆన్లైన్లో చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 2 రివార్డ్ పాయింట్లు, ఆఫ్‌లైన్ రూ.100 వెచ్చింపుపై 1 రివార్డ్ పాయింట్ పొందొచ్చు. రూ.500 నుంచి రూ.3 వేల వరకు చేసే ఇంధన కొనుగోళ్లపై 1 శాతం మినహాయంపు ఇస్తోంది. ఐఆర్సీటీసీపై చేసే లావాదేవీలపై 1.8 శాతం, రైల్వే బుకింగ్ కౌంటర్లలో చేసే లావాదేవీలపై 2.5 శాతం తగ్గింపు ఇస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank Fortune Gold Card)
కోటక్ మహీంద్రా ఫార్చూన్ గోల్డ్ కార్డ్ కూడా ఎలాంటి వార్షిక రుసుము, జాయినింగ్ ఫీజు లేకుండా వస్తోంది. ఈ కార్డు ద్వారా చేసే ఇంధన కొనుగోళ్లపై ఒక క్యాలెండర్ సంవత్సరంలో రూ.3,500 వరకు రాయితీ లభిస్తుంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Classic Credit Card)
ఎటువంటి వార్షిక రుసుము లేకుండా లైఫ్‌టైమ్ ఉచితంగా వినియోగించేలా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్రెడిట్ కార్డుని అందిస్తోంది. అలాగే, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెలెక్ట్ పేరిట మరో క్రెడిట్ కార్డు అందిస్తోంది. పేటీఎంలో మూవీ టికెట్ బుకింగ్‌పై 1+1 ఆఫర్ పొందొచ్చు. నెలకు రెండు సార్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. బిల్ జనరేట్ అయిన మొదటి 30 రోజుల్లో రూ.10 వేల వరకు ఈఎంఐ సదుపాయంతో కొనుగోళ్లు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. రూ.5 వేలు ఖర్చు చేస్తే రూ.500 విలువైన వెల్కమ్ వోచర్ అందించనుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda easy credit card)
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డు కూడా లైఫ్‌టైమ్ ఫ్రీ. ఈ కార్డు మంజూరైన 60 రోజుల్లోగా రూ.6 వేలు, ఏడాదిలో రూ.35 వేలు ఖర్చు చేస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డులపై ఎటువంటి వార్షిక రుసుమూ ఉండదు. సినిమా కోసం చేసే ఖర్చు, డిపార్ట్ మెంట్ స్టోర్లలో చేసే ప్రతి రూ.100 ఖర్చుపై గరిష్ఠంగా 5 క్రెడిట్ పాయింట్లు ఇస్తోంది. రూ.400 నుంచి రూ.5 వేల వరకు చేసే ఇంధన కొనుగోళ్లపై 1 శాతం మినహాయంపు ఇస్తోంది.
వీటితో పాటు, యెస్ బ్యాంక్ ప్రాస్పరిటీ పర్చేజ్ క్రెడిట్ కార్డు, కెనరా బ్యాంక్ క్లాసిక్ వీసా ఇండివిడ్యువల్ క్రెడిట్ కార్డ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎల్ఐటీ క్రెడిట్ కార్డ్, హెచ్ఎస్బీసీ వీసా ప్లాటినమ్ క్రెడిట్ కార్డు కూడా ఎలాంటి జాయినింగ్ ఫీజు లేకుండా, లైఫ్ టైమ్ ఫ్రీగా వస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –