DailyDose

పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసిన మహిళకు జరిమానా

పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసిన మహిళకు జరిమానా

తన కుమార్తెపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళ చేసిన తప్పుడు ఆరోపణలను దిల్లీలోని అదనపు సెషన్స్‌ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి అవాస్తవాలతో పోక్సో చట్టాన్ని (POCSO Act) దుర్వినియోగం చేసినందుకుగాను రూ.లక్ష జరిమానా చెల్లించాలని సదరు మహిళను ఆదేశించింది. కేవలం నిందితులపై ఉన్న కోపంతోనే ఆ మహిళ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో తేలిందని న్యాయస్థానం వెల్లడించింది.

తన ఐదేళ్ల కుమార్తెపై కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ దిల్లీకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడం కోసమే సదరు మహిళ ఇలాంటి ఆరోపణలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సమస్య పరిష్కారానికి ఇతర మార్గాలు ఉన్నప్పటికీ పోక్సో చట్టం కింద వారిని ఇబ్బందులను గురిచేసేందుకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. అంతేకాకుండా నిందితుల నుంచి ఆస్తి దోచుకోవడానికే ఇలా ఆమె తప్పుడు ఫిర్యాదు చేసిందని తెలిసింది.

‘ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవాలని సదరు మహిళ ప్రయత్నించారు. తద్వారా నిందితులకు అవమానం, పరువునష్టానికి కారణమయ్యారు. పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ఆమె యత్నించారు. భూ తగాదాలు, దంపతుల మధ్య గొడవలు, వ్యక్తిగత ద్వేషాలు, రాజకీయ ఉద్దేశాలతో నిందితులను జైలుకు పంపించి వారికి అవమానం కలిగించేందుకు ఈ తరహా కేసులు నమోదు చేస్తుండటం ఆందోళనకరం. చట్టాన్ని దుర్వినియోగం చేసే ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడాలి. అందుకే ఆమెకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నాం. నెల రోజుల్లో జరిమానా చెల్లించడం విఫలమైతే మూడు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది’ అని పేర్కొంటూ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జీ సుశీల్‌ బాల డాగర్‌ తీర్పు వెలువరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z