Politics

రైతులకు 3గంటల కరెంట్‌ సరిపోతుందా?

రైతులకు 3గంటల కరెంట్‌ సరిపోతుందా?

ఐదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్రను ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజల చేతుల్లో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ హయాంలో ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్‌ నీళ్లు ఇవ్వలేకపోయింది. 1969లో 400 మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపారు. ఎమ్మెల్యేలను కొని తెరాసను చీల్చాలని కాంగ్రెస్‌ చూసింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అన్నట్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాను.

పింఛను ₹2వేలకు పెంచాం. మళ్లీ భారాస ప్రభుత్వం రాగానే పింఛను ₹5వేలకు పెంచుతాం. 3కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చాం. నీటిపన్నును రద్దు చేశాం.. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ప్రజల కట్టే పన్నులు రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నాం అని కాంగ్రెస్‌ అంటోంది. రైతుబంధు దుబారానా? మళ్లీ భారాస ప్రభుత్వం రాగానే రైతుబంధు ₹16వేలకు పెంచుతాం. రైతులకు 3గంటల కరెంట్‌ చాలు అని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. రైతులకు 3గంటల కరెంట్‌ సరిపోతుందా? ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తాం అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి? ధరణి వల్ల అర్ధగంటలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయి. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ భారాస’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అప్పులు కట్టలేక 49 శాతం సింగరేణి వాటాను కేంద్రానికి అప్పజెప్పారు
రామగుండం: అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవని.. టీవీల్లో నాయకుల చర్చలు విని ప్రజలు నిర్ణయానికి వస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. భారతదేశంలో కూడా అలాంటి విధానం రావాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘నవంబర్‌ 30న పోలింగ్.. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు. అంతటితో మా పని అయిపోయింది అని ప్రజలు అనుకోవద్దు. అప్పటినుంచే అసలు ప్రక్రియ మొదలు అవుతుంది. ఎవరి చేతుల్లో ఉంటే రాష్ట్రం బాగుంటుందో ప్రజలు ఆలోచించాలి. అలా ఆలోచించి ఓటు వేస్తే మంచి చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్‌. సింగరేణి 134 ఏళ్ల కింద పుట్టిన మన సొంత సంస్థ. మన సొంత ఆస్తి. కాంగ్రెస్‌ నేతలకు చేతకాక.. సమైక్య నేతల చేతుల్లో పెడితే వారు కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన అప్పులను కట్టలేక 49 శాతం సంస్థ వాటాను కేంద్రానికి అప్పజెప్పారు ఈ కాంగ్రెస్‌ నేతలు.

తెలంగాణ రాగానే ఎంతో మంది ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపాం. తెలంగాణ మొత్తం ఆగం అయింది.. ఇప్పుడు రాష్ట్రానికి ఒక దశ దిశ కావాలని వారిని అడిగి ఎన్నో సలహాలు తీసుకున్నాం. అందుకు అనుగుణంగానే పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశాం. రాష్ట్ర సంపద పెరుగుతున్నా కొద్దీ ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ పదేళ్లు సుపరిపాలన సాగించాం. ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. ఎన్నో అంశాల్లో దేశానికే దిక్సూచిగా ఉంది. ఇదే తరహాలో మంచి పాలన తెలంగాణలో కొనసాగాలంటే మరోసారి భారాస అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఈ పదేళ్లలో భారాస చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ఓటు వేయండి’’ అని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z