అయిదేళ్ల కిందట టెండర్లు ఖరారైన సౌరవిద్యుత్ ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తొక్కిపెట్టింది. ఎందుకంటే వాటిలో అస్మదీయ కంపెనీలేవీ లేవు. ప్రభుత్వతీరుపై మూడు సంస్థలు న్యాయపోరాటం చేస్తున్నాయి. సుమారు మూడేళ్ల క్రితం అందులో ఒక ప్రాజెక్టును అదానీ గ్రూపు సొంతం చేసుకుంది. అదానీ ఉంటే చాలు.. జగన్ ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తుంది. కడపలోని సౌరవిద్యుత్ పార్కులో ప్రాజెక్టుల ఏర్పాటుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) టెండర్లు పిలిచింది. గత ప్రభుత్వం కొన్ని కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వైకాపా అధికారంలోకి వచ్చాక.. యూనిట్ ధర ఎక్కువని పీపీఏ కుదుర్చుకోవడానికి అనుమతించలేదు. అదానీ సంస్థ ప్రాజెక్టు దక్కించుకున్నాక.. ధర విషయాన్నే పక్కన పెట్టింది. ప్రజలపై 25 ఏళ్లలో రూ.2,669.07 కోట్ల అదనపు భారం పడుతున్నా లెక్కపెట్టకుండా అయిదేళ్ల క్రితం సెకి కోట్ చేసిన ధరకే పీపీఏలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. అదానీ ఒక్కరికే ఎందుకని.. మరో రెండు ప్రాజెక్టులకూ అనుమతులు ఇచ్చింది. వీటికి త్వరలోనే సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది.
ప్రభుత్వం పీపీఏలు కుదుర్చుకునే ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌లో మూడోవంతు అదానీ కంపెనీదే. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్‌కు చెందిన ఎస్‌బి ఎనర్జీ ఇండియాను అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ టేకోవర్ చేసింది. దాంతో కడపలో ఎస్‌బి ఎనర్జీ ఏర్పాటుచేసే 250 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టూ అదానీ సొంతమైంది. ఆ ప్రాజెక్టు నుంచి యూనిట్ రూ.2.70 చొప్పున విద్యుత్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రభుత్వం లెక్కపెట్టలేదు. అయిదేళ్ల క్రితం నిర్వహించిన టెండరు ధరకే విద్యుత్ తీసుకోవడం ద్వారా అస్మదీయ కంపెనీకి భారీగా లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం సౌరవిద్యుత్ ధరలు భారీగా తగ్గాయి. యూనిట్ రూ.2, అంతకంటే తక్కువకే దొరుకుతోంది. సెకి టెండర్ల ద్వారా గుజరాత్ డిస్కంలు యూనిట్ విద్యుత్ రూ.1.99కే తీసుకున్నాయి. ఈ లెక్కన యూనిట్‌కు 71 పైసలు అధికంగా అదానీకి చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ట్రేడ్ మార్జిన్ 7 పైసలతో కలిపి.. 78 పైసల అదనపు భారాన్ని ప్రజలపై వేయడానికి ప్రభుత్వం వెనుకాడటం లేదు. పీపీఏ వ్యవధి పాతికేళ్లలో ఈ రూపేణా ప్రజలపై రూ.889.69 కోట్ల అదనపు భారం పడుతుంది.
తెదేపా కుదుర్చుకుంటే తప్పు.. మరి జగన్ చేస్తున్నదేంటి?
‘‘తెదేపా హయాంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థలతో 25 ఏళ్ల పాటు పీపీఏలను కుదుర్చుకున్నారు. సాంకేతికత పెరిగేకొద్దీ రేట్లు తగ్గుతాయన్న స్పృహ ఉన్నా.. బుద్ధి.. జ్ఞానం ఉన్నవారు 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుంటారా? దీర్ఘకాలం పీపీఏలను కుదుర్చుకోవడం ద్వారా ప్రజలపై భారాన్ని వేయడం ధర్మమేనా?’’ అని 2019 జులై 19న అసెంబ్లీలో విద్యుత్‌రంగంపై జరిగిన చర్చలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
మరిప్పుడు జగన్ చేస్తున్నదేంటి? సెకి నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌నూ 25 ఏళ్ల పాటు తీసుకునేలా ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు?
సెకి బిడ్ ద్వారా గుజరాత్ డిస్కంలు రూ.2.43కు విద్యుత్ తీసుకుంటున్నాయని అప్పట్లో అసెంబ్లీలో చెప్పి.. అయిదేళ్ల తర్వాత అదే సెకి నుంచి యూనిట్‌కు రూ.2.49 వంతున చెల్లించేలా ఒప్పందం చేసుకుంటే ప్రజలపై అదనపు భారం కాదా?
👉 – Please join our whatsapp channel here –