చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ ఉద్యోగాన్ని బర్తరఫ్ చేసి లండన్ కు పంపిన అధికారులు.
………………………………………………………..
తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ చేస్తున్న ఉద్యోగం నుండి బర్తరఫ్ ( డిస్మిస్) అయి స్వదేశానికి వెళ్ళిపోయాడనే సంగతి నేడు కొద్దిమందికి మాత్రమే. తన జీతం జీవితం మొత్తాన్ని తెలుగు సరస్వతికే అంకితం చేసిన బ్రౌన్ స్వంతంగానే తన బంగ్లాలో సాహిత్య కచేరిని (కార్యాలయాన్ని) నడుపుకొంటూ ఎందరో పండితులను చేరదీసి తన జీతంనుండి వారికి నెలనెలా జీతాలు ఇచ్చేవాడు. బ్రౌన్ ను ఆశ్రయించిన పండితులలో చాలామంది బ్రౌన్ సేకరించిన కావ్యాలను పరిష్కరించి వాటికో రూపును కల్పించారు. నాడు ఫిలిఫ్ బ్రౌన్ కొలువులో ఎవరెవరు పండితులు ఉండేవారో తెలుసుకొందాం.
(1) అద్వైతం బ్రహ్మయ్య
(2) సముద్రాల అనంతాచార్యులు
(3) జూలూరి అప్పయ్య
(4) ముడుంబి కృష్ణమాచార్యులు
(5) నందివాడగుర్రాజు
(6) పట చంద్రయ్య
(7) పరవస్తు నరసింహాచార్యులు, (8) బోయినపల్లి చెంచయ్య
(9) తరుపతి తాతాచార్యులు
(10) కంభం నరసింహాచార్యులు
(11) చిలకమర్రి నరసింహాచార్యులు
(12) సముద్రాల నరసింహాచార్యులు
(13) ములుపాక బుచ్చయ్యశాస్త్రి
(14) అరణిమఠం వీరభద్రయ్య
(15) వారణాసి వీరాస్వామి
(16) వంగీపురం వెంకట కృష్ణమాచార్యులు
(17) పైడిపాటి వెంకటనరసయ్య
(18) దంపూరి వెంకటసుబ్బశాస్త్రి
(19) గరిమెళ్ళ వెంకయ్య
(20) మామిడి వెంకయ్య
(21) తెన్నెల సింగటయ్య,
(22) నందివాడసుబ్బన్న
(23) బొడ్డపాటి సుబ్బన్న
వీరి సహచర్యంతో తాను ఉద్యోగరీత్యా ఏ వూర్లో వున్నా అతని బంగళా నిరంతరము సాహిత్యగోష్ఠితో కిటకిటలాడి పోయేది. బ్రౌన్ దగ్గర అయోధ్య రామిరెడ్డి అనే నమ్మకస్తుడు వుండేవాడు. కడపలో బ్రౌన్ ఓ బంగ్లాను కొన్నాడు. బ్రౌన్ ఉద్యోగరీత్యా ఏ వూర్లోవున్నా 1828 నుండి రామిరెడ్డే మొత్తం బంగళా వ్యవహారాలు బంగ్లాలోవున్న తోటల బాగోగులు బంగ్లాలో వున్న పండితుల మంచిచెడ్డలు చూసుకొనేవాడు.
1831 – 33 ప్రాంతములో గుంటూరు జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 1833 లో బ్రౌన్ గుంటూరు కలెక్టరుగా వుండేవాడు. 1831, 1832 సంవత్సరాలలో విపరీతమైన వర్షాలు కురిసాయి దాంతో రైతులు సంపూర్తిగా పంటలు కోల్పోయారు. 1833 వ సంవత్సరంలో తీవ్ర వర్షాభావం వలన పంటలు ఎండిపోయాయి.దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కరువు నందన నామ సంవత్సరము వచ్చింది కాబట్టి దీనిని నందన కరువన్నారు. తినడానికి తిండిలేక అనేకమంది అసువులు బాసారు. బ్రతికివున్నవారి డొక్కలు లోపలకి పీక్కుపోయాయి, అందుకే ఈ కరువును డొక్కల కరువన్నారు. ఈ కరువు ఆంధ్రప్రాంతంలో బళ్ళారి నుండి గుంటూరుకు చిత్తూరు నుండి గుంటూరు వరకు వ్యాపించి వుండేది. నిజానికి దక్షిణ భారతదేశమంతా కరువుతో అల్లాడిపోయింది, అందుకే దీనిని పెద్ద కరువన్నారు. పశువులకు మనుష్యులకు గ్రాసము కరువైంది, దొంగతనాలు అధికమైయ్యాయి. ఇంత బువ్వకోసం శీలం హరించుకుపోయింది, పట్టెడు గింజలకోసం కన్నబిడ్డలను బానిసలుగా అమ్మేశారు.పన్నులు శిస్తులు కట్టేవారు లేక ప్రభుత్వ ఖజానా బోసిపోయింది. ప్రభుత్వం కరువుపై శీతకన్నేసింది.
ప్రజల కడగండ్లు చూడలేక కలెక్టరుగా వున్న చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ గుండె తరుక్కుపోయింది. ఇక్కడ దుర్భరక్షామ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రజలకు మరణమే శరణ్యమని సెయింటు జార్జి ఫోర్టు (మదరాసు)లో వున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ( గవర్నరుకు) నివేదిక (రిపోర్ట్ ) వ్రాశాడు. కలెక్టరు రిపోర్టు చూడగానే సెయింట్ జార్జి ఫోర్ట్ అధికారులు భగ్గున మండిపోయారు. బ్రౌన్ కు ఎంతగా అధికార అవివేకముందని కారాలు మిరియాలు నూరారు.ఆ ప్రాంతంలో వైఫలిత్యాలు విపత్తులు అనావృష్టి అనే మాటలు నివేదికలో వాడకుండా కరువని వ్రాస్తాడా ! అంటూ కోప్పడ్డారు.కరువని వ్రాయడం వలన తక్షణసాయాన్ని ప్రజలకు అందించాలి. అందుకు బోల్డంత ధనాన్ని వ్యయం చేయాలి.విపత్తు అని వ్రాసివుంటే ప్రభుత్వం మీద అంతగా భారం పడేదికాదు.
బ్రౌన్ 1832 లో మచిలీపట్నంలో జాయింట్ క్రిమినల్ జడ్జిగా వుండేవాడు. ఇప్పటిలాగానే అప్పుడు కూడా కూటసాక్ష్యాలు, దొంగపత్రాలు, తప్పుడు ఆధారాలు కోర్టులలో కొల్లలుగా వుండేవి. వాది ప్రతివాదులు కేసు వేసిన మొదట్లో ఒకలాగున చివర్లో మరోకలాగున ప్రవర్తించేవారు దొంగసాక్ష్యాలు పత్రాలు దొరకినప్పుడల్లా వారికి బ్రౌన్ జరిమానాలు శిక్షలు విధించేవాడు. ఒకసారి ఇలా వచ్చిన దొంగసాక్ష్యానికి గాను జరిమానా విధించి, మరలా దానిని రద్దుచేసి 1832 అగస్టు నెల 6 వ తేదీన ముద్దాయిలకు కఠినశిక్ష విధించాడు. దాంతో ముద్దాయిలు పై అధికారులకు అప్పీలు చేసుకొన్నారు. డిసెంబరు నెలలో బ్రౌన్ ను గుంటూరు యాక్టింగ్ కలెక్టరుగా బదిలీచేశారు. అదే నెలలోనే రెండవ తీర్పును ఇచ్చి బ్రౌన్ తీవ్రమైన తప్పుచేశాడంటూ నార్తరన్ ప్రోవిన్షియల్ (State) కోర్టులోని ఇద్దరు జడ్జీలు అభియోగం మోపారు. ఈ దెబ్బతో పట్టుమని 12 వారాలకే, అంటే 19 మార్చి 1833లో గుంటూరు కలెక్టర్ గా వున్న బ్రౌన్ ను చిత్తూరు జిల్లా జడ్జిగా బదిలీచేశారు.
అక్కడో నెలరోజులైనా వున్నాడో లేడో వెంటనే అతనిని అక్కడనుండి రామహేంద్రవరం అగ్జిలరి కోర్టు జడ్జిగా బదిలీ చేసేశారు.
నార్తరన్ ఫ్రోవిన్షియల్ కోర్టు జడ్జిలు సిఫారస్ మేరకు అధికారులు చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ ను 1834 అక్టోబరు నెల 25న ఉద్యోగం నుండి బర్తరఫ్ చేశారు.
17 సంవత్సరాల సర్వీస్ లో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా జీవితాన్ని ఉద్యోగానికే అంకితం చేసిన బ్రౌన్ జీవితం చిన్న డిస్మిస్ కాగితపు ముక్కతో అత:పాతాళానికి పడిపోయింది.
ఉద్యోగం ఊడిన తరువాత బ్రౌన్ ఏలా స్పందించాడు ? ఉద్యోగం లేక 3 సంవత్సరాలపాటు లండన్ లో ఏమి చేశాడు ? మరలా ఉద్యోగం ఎలా వచ్చింది అనే అంశాలు తరువాత తెలుసుకొందాం.
👉 – Please join our whatsapp channel here –