* మద్యం మత్తులో పక్కబోటులోకి సిగరెట్లు విసిరేశారు
విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘటనలో నైలాన్ వలల వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని నగర సీపీ రవిశంకర్ చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో 30 బోట్లు కాలిపోయాయన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. ఈ ఘటనలో వాసుపల్లి నాని, అతడి మామ సత్యం ప్రధాన నిందితులుగా తేల్చామని చెప్పారు. మద్యం మత్తులో సిగరెట్లు పక్కబోటులోకి విసిరేశారని ఆయన వివరించారు. బోటు ఇంజిన్‌పై సిగరెట్ పడటంతోనే ప్రమాదం జరిగిందన్నారు. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని సీపీ చెప్పారు.
* కరాచీ షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం
పాకిస్థాన్ (Pakistan)లోని కరాచీ (Karachi)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం ఉదయం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 7 గంటల సమయంలో స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. పైన ఉన్న మరో మూడు అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 42 మందిని ప్రాణాలతో రక్షించారు. భవనంలో మరికొందరు చిక్కుకొని ఉండొచని భావిస్తున్న అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. షాపింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, సాఫ్ట్‌వేర్ హౌస్‌లతో ఉన్న ఈ భవనం ఆ ప్రాంతంలో ఎతైనది. గతంలోనూ ఇదే షాపింగ్ మాల్‌లో విద్యుదాఘాతంతో చిన్న ప్రమాదం చోటు చేసుకొంది.
* ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ మృతి
మోడీ సెక్యూరిటీ కోసం వచ్చి గుండెపోటుతో డీఎస్పీ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటన తిరుమలలో శ్రీవారి నడకదారిలో జరిగింది. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) 1,805వ మెట్టు వద్ద గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆస్పత్రికి తరలించేలోగా ఆయన మృతి చెందినట్లు తెలిసింది. ప్రధాని మోడీ తిరుమల పర్యటన నేపథ్యంలో కృపాకర్ భద్రతా విధుల నిమిత్తం తిరుమలకు వచ్చారు. డీఎస్పీ కృపాకర్ స్వస్థలం విజయవాడలోని పోరంకి. కృపాకర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.
* ఏఓబీలో రోడ్డు ప్రమాదం
మల్కాన్‌గిరి జిల్లా ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంతల్‌గుడా ఘాట్ రోడ్డు వద్ద టిప్పర్ బోల్తా పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే శనివారం చిత్రకొండ నుంచి 16 మంది కూలీలు, సిమెంట్ బస్తాలు, ఇనుప రాడ్లు తీసుకొని ఓ టిప్పర్ హంతల్‌గుడా వైపు వెళ్తోంది. జోడాంబో ఠాణా హంతాల్‌గుడా ఘాట్‌రోడ్డు వద్ద టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు క్షతగాత్రులను జోడాంబో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితులను నవరంగపూర్ జిల్లాకి చెందిన వారిగా గుర్తించారు. మల్కాన్‌గిరి జిల్లా ఎమ్.వి. 79 గ్రామానికి చెందిన పీకే స్వాయీ అనే గుత్తేదారు స్వాభిమాన్ ప్రదేశంలో వంతెన, రహదారి నిర్మాణ పనుల కోసం ఈ సిమెంట్ బస్తాలు, ఇనుపరాడ్లను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* మద్యం మత్తులో రైలు పట్టాలపై లారీ నడిపిన డ్రైవర్
మద్యం సేవించిన మత్తులో ఉన్న డ్రైవర్ లారీని రైలు పట్టాలపై నడిపాడు. (Drunk Man Drives Truck On Railway Track) ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మరో ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం నడి రాత్రి వేళ మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ షేర్పూర్ ఫ్లైఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి దానిని నడిపాడు. రైలు పట్టాల మధ్యలో ఇరుకున్న లారీ అక్కడి నుంచి ముందుకు కదలలేదు. దీంతో ఆ లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. కాగా, గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లూథియానా స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు పట్టాల మధ్యలో లారీ నిలిచి ఉండటాన్ని లోకో పైలట్ గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఆ రైలు లారీని కొద్దిగా తాకి ఆగింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
* మైనర్ బాలిక ఆత్మహత్య
ప్రేమ విఫలం కావడంతో ఓ దళిత మైనర్ బాలిక ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం ఇటిక్యాల గ్రామానికి చెందిన దళిత మైనర్ బాలిక (17), అదే గ్రామానికి చెందిన రజక యువకుడు (21) మధ్య గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. కాగా యువతి పెళ్లి చేసుకోవాలని యువకుడిని వేడుకోవడంతో యువకుని ఇంట్లో కుటుంబ సభ్యులు నిరాకరించారు. ప్రేమ విఫలం అవుతుందని భావించిన యువతి గత ఇరవై రోజుల క్రితం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. తాగిన నాలుగు రోజుల తర్వాత పురుగుల మందు తాగినట్లు యువతి ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలుపడంతో ములుగు మండలం లక్ష్మక్క పల్లిలోని ఆర్వీఏం హాస్పిటల్‌కు తరలించారు.ఆలస్యంగా హాస్పటల్‌లో చేరిన యువతి కిడ్నీ లు, లీవర్ పాడైపోయాయని, కిడ్నీలు పాడవడంతో యువతికి డయాలసిస్ చేసి ఇంటికి పంపారు. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు తెలపడంతో గ్రామంలో పంచాయతీపెట్టారు. ఎలక్షన్ లు ముగిసిన తర్వాత న్యాయం చేద్దామని గ్రామ పెద్దలు యువతీ కుటుంబ సభ్యులకు తెలిపారు. యువతి ఆరోగ్యం క్షిణించడంతో ఆమె శనివారం మృతి చెందింది. యువతి మృతి చెందడంతో కుటుంబీకులు డెడ్ బాడీతో యువకుడి ఇంటి ముందు నిరసన చేశారు. ఇరువర్గాలు, గ్రామ పెద్దలు సమక్షంలో మాట్లాడటంతో సమస్య సద్దుమణిగి యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం పై జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
* సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ పరిధిలో గంజాయి సీజ్!
సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని ఆయన చెప్పారు. రెండు బొలెరో వాహనాలను సీజ్ చేసి.. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు. బొలెరో వాహనాల కింది భాగంలో బాక్సు లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు ముగ్గురూ.. మహారాష్ట్రకు చెందిన తమ యజమాలు హనుమాన్ మోహిత్, సమీర్ గవండేల ఆదేశం మేరకు ఒడిశాలోని జన్ భాయ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే త్రినాథ్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు వివరించారు. టాస్క్ ఫోర్స్ అధికారుల సమాచారం మేరకు వాహనాల తనిఖీ నిర్వహించి గంజాయిని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –