ఎక్కడో మాతృభూమికి దూరంగా ఎడారిలో అందునా నడి అరబ్బు నేలపై మక్కా, మదీన పుణ్యక్షేత్రాల మధ్య ఎర్ర సముద్ర తీరాన తెలుగు పలుకు వింటే చాలు.. అనే నైరాశ్య పరిస్థితులలో నుండి ఒక్కసారిగా తెలుగుతనం ఉట్టిపడిన సందర్భం అది.. ఒకప్పుడు నక్సలైట్ల విప్లవ పోరాటలతో అట్టుడికిపోయిన అటవీ ప్రాంత గిరిజనుల నుండి మొదలు నేటి హైటెక్ సిటీ సంపన్నవర్గాలకు చెందిన వారి వరకు, అటు వేగావతి నదీ తీరాన విజయనగరం జిల్లా బొబ్బిలి నుండి ఇటు తుంగభద్ర నదీ తీరాన ఉన్న కర్ణాటక సరిహద్దు కర్నూలు జిల్లా వరకూ వివిధ జిల్లాల తెలుగు ప్రవాసీయులు ఆత్మీయంగా కలుసుకొన్న సన్నివేశం.
శుక్రవారం రాత్రి సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనం మరియు శివమంగళ హారతుల కార్యక్రమం సందర్భంగా తెలుగు ప్రవాసీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రవాసీయులు ఇందులో పాల్గొనగా అందులో కొందరు ముస్లింలు కూడా కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొన్నారు.
వచ్చే నెలలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కూడా జెద్ధా నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సాటా అధ్యక్షులు మల్లేశన్ ఈ సందర్భంగా వెల్లడించారు. తబూక్, అభా నగరాలలో కూడా భారతీయ ఉత్సవాలను నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఒక్క తెలుగువారి వరకూ మాత్రమే పరిమితం కాకుండా యావత్ భారతీయులను ఒక వేదికపై తీసుకురావడానికి సాటా ప్రయత్నిస్తోందని మల్లేశన్ చెప్పారు.
సౌదీ అరేబియాలో 40 సంవత్సరాలుగా ఉన్న తాను తెలుగువారిని ఒక యజ్ఞంగా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్న సాటా తరహా సంస్థను ప్రప్రథమంగా చూస్తున్నానని హైదరాబాద్ నగరానికి చెందిన ప్రవాసీ ప్రముఖుడు ఏజాస్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు ఉన్నా సమన్వయం చేసేందుకు ఒక సామూహిక వేదిక లేకపోవడం ఒక లోపంగా ఉందని మరో ప్రవాసీ ప్రముఖుడు రాంబాబు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క తెలుగువాడికి చేరువ కావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని ఆయన సూచించారు. సేవా భావంతో యువత మరింత ముందుకు రావాలని హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రామవత్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
జెద్ధా నగరానికి వచ్చినప్పటి నుండి ఒక్కసారి తెలుగు పలుకు వినలేదని, విసుగెత్తి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్న తరుణంలో సాటా గురించి తెలిసి, సమ్మేళనానికి వచ్చిన తనకు తెలుగు సమూహాన్ని చూస్తే సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతోందని ఓ ప్రముఖ బ్యాంకులో పని చేసే చిత్తూరు జిల్లాకు చెందిన మురళీ భావోద్వేగంగా చెప్పాడు.
20 సంవత్సరాలుగా తాను జెద్ధా నగరంలో ఉన్నా కూడా ఒక్క సారిగా తెలుగువారితో సమావేశం కాలేకపోయానని, తోటి తెలుగు వారిని కలుసుకోవాలనే తన చిరకాల వాంఛ ఈ రోజుతో తీరిందని గుంటూరు నగరానికి చెందిన ముహమ్మద్ ముజీబ్ అన్నారు. విదేశాలలో విందు భోజనాలు, సమావేశాలు కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమనుకున్నా తనలాంటి ఒక సామాన్యుడు కూడా వచ్చి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే అవకాశం రావడం ఆనందదాయకమని నిజామాబాద్ జిల్లా మారుమూల గిరిజన తండాకు చెందిన దీప్ సింగ్ అనే గిరిజన యువకుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. చుక్క చుక్క కలిస్తే కదా సముద్రమయ్యేది అని మరో తెలుగు ప్రవాసీ ప్రముఖుడు మీర్జా ఖుద్రత్ బేగ్ అన్నారు. సౌదీలోని ఈ ప్రాంతంలో ఇంత భారీగా తెలుగు కుటుంబాలు ఉంటాయని తాము అనుకోలేదని నవేంద్ర నాథ్ తాత, నల్లమల్లి నిఖిలేశ్, నిఖిల్ గోడబలు చెప్పారు.
కార్తీక మాస దీపోత్సవ పూజలు
సాయంకాల ప్రదోషకాలానికి తెలుగు కుటుంబాలన్నీ ఆధ్యాత్మిక చింతనతో దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యా దీపం నమోస్తుతే..అంటూ శ్రీకారం చుట్టి కార్తీక పురాణం, విష్ణు సహస్రనామాలను పారాయణం చేసాయి. నేతి దీపముతో అర్పించిన దామోదర హారతితో భక్తులు భక్తితో పరవశించిపోయారు. తెలుగు కుటుంబాలకు తోడుగా కొందరు ఒడిశా, రాజస్థానీ సంప్రదాయక వేదపండితులు వేదమంత్రాల జపంతో భక్తి, ఆధ్యాత్మికత మేళవింపబడింది.
వివాహ భోజనంబు వింతయిన వంటకంబు అన్న రీతిలో సంప్రదాయక తెలుగు భోజనాలను వడ్డించారు. సాటా జెద్ధా మహిళా ప్రతినిధి బృందానికి చెందిన రామలక్ష్మి, కవిత, సుజాత, శాంతిలు అతిథులందరికీ కావాల్సిన రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. తాడేపల్లిగూడేనికి చెందిన పాల సురేశ్, గుంటూరు నగరానికి చెందిన రామలక్ష్మి చేసిన వంటకాలను మరీ అడిగి వడ్డించుకున్నారు. చీరాలకు చెందిన గోపి తన మధుర సంగీతంతో సభికులను అలరింపజేసాడు. జెద్ధాలోని భారతీయ పాఠశాలలో తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన మాజీ ఉపాధ్యాయురాలు ఇందిర, వివిధ సామాజిక కార్యక్రమాలకు గాను జాడీ మల్లేశం, ఫారుఖ్‌లను తమ వృత్తి నైపుణ్యానికి గాను సత్కరించారు.
చిన్నారులకు క్రీడా ఉల్లాస కార్యక్రమాలు
పెద్దలకు సరే, మరి చిన్నారుల సంగతి ఏమిటి?.. సాటా నిర్వహించే అన్ని కార్యక్రమాలలోనూ చిన్నారుల ఉల్లాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. చిన్నారులకు ఈత పోటీలు, ఇతర క్రీడా పోటీలను నిర్వహించగా అందులో నెగ్గిన కావ్యాంశ్, సుజాల్, అలోకితలకు బహుమానాలు అందించారు. త్వరలో చిన్నారుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా సాటా జెద్ధా సాంస్కృతిక విభాగం సమన్వయకర్త సుజాత తెలిపారు.
కార్యక్రమానికి జెద్ధా నగరంతో పాటు చుట్టు పక్కల రాబీఖ్, యాన్సూ పారిశ్రామిక ప్రాంతాల నుండి ప్రవాసీయులు వచ్చారు. సభికులకు సాటా జెద్ధా అధ్యక్షుడు నరేశ్ స్వాగతం పలుకగా సాటా కీలక భాద్యుడు చాపల బాలాజీ వందన సమర్పణ చేసారు. జెద్ధా ప్రాంత తెలుగు ప్రవాసీయులు మల్లేశ్ (0597384449) ను నరేశ్ (0568534792) లేదా బాలాజీ (0540927837) లను సంప్రదించవచ్చు.
👉 – Please join our whatsapp channel here –