* టాటా టెక్నాలజీస్ ఐపీఓ సరికొత్త రికార్డు
టాటా గ్రూప్ నుంచి వచ్చిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది. సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో స్పందన అందుకున్న ఈ ఐపీఓ.. తాజాగా ఎల్‌ఐసీ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా వచ్చిన ఎల్ఐసీ (LIC).. రూ.20,557 కోట్లు సమీకరించడంలో భాగంగా అత్యధికంగా 73.4 లక్షల దరఖాస్తుల్ని అందుకుంది. తాజాగా టాటా టెక్నాలజీస్ ఐపీఓ (Tata Tech IPO) ఆ రికార్డును అధిగమించింది. రూ.3,043 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఐపీఓకు భారీ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. 73.60 లక్షల దరఖాస్తులతో ఎల్‌ఐసీ రికార్డును బ్రేక్ చేసింది. టాటా గ్రూప్ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన ఐపీఓ కావడంతో భారీ స్థాయిలో స్పందన లభించింది.టాటా టెక్ సహా ఫ్లెయిర్ రైటింగ్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఐఆర్‌ఈడీఏ ఐపీఓల పబ్లిక్ ఇష్యూలు ముగిశాయి.రూ.7,380 కోట్లను సమీకరించేందుకు వచ్చిన ఈ మొత్తం ఐపీఓలకు రూ.2.6 లక్షల కోట్ల విలువకు దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటన్నింటిల్లోనూ టాటా టెక్ ఐపీఓకు 69.4 రెట్లతో అధిక స్పందన వచ్చింది. పెన్నుల తయారీ కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ రూ.593 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు రాగా 17 లక్షల దరఖాస్తులతో 46.7 రెట్లు చొప్పున సబ్‌స్క్రిప్షన్ లభించింది. రూ.500.69 కోట్ల గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓకు సైతం 28.5 లక్షల అప్లికేషన్లతో 64.2 రెట్లు చొప్పున స్పందన లభించింది. రూ.2,150 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో వచ్చిన ఐఆర్‌ఈడీఏకు 38.8 రెట్ల స్పందన అందుకుంది. రూ.1,092 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.2 రెట్ల స్పందన మాత్రమే వచ్చింది.
* విమానాల్లో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా భారీగా పెరుగుతుంది. తాజాగా దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన దాని ప్రకారం, గురువారం రోజున దేశీయ విమానాల్లో 4,63,417 మంది ప్రయాణించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇది రికార్డు స్థాయిని నమోదు చేసింది. నవంబర్‌లో విమాన ప్రయాణికుల రద్దీ నాలుగు రెట్లు పెరిగింది.కరోనా కాలంలో తీవ్ర నష్టాలతో ఉన్న విమానయాన సంస్థలు ఆ తర్వాత మెల్లగా పుంజు కుంటున్నాయి. విమాన ప్రయాణాల పట్ల ప్రజల్లో నమ్మకం, సానుకూల దృక్పథం, ప్రగతిశీల విధానాల కారణంగా దేశీయ విమాన సర్వీసులు రికార్డులకు చేరుకుంటున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. దీనిపై మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా. నవంబర్ 18, 19, 20 తేదీల్లో విమానాల్లో ఎక్కువ మంది ప్రయాణించారని ఆ శాఖ తెలిపింది.
* ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్‌లో ఈడీ సోదాలు
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్‌టెక్, దాని ప్రమోటర్లపై కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో భాగంగా గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ టెక్ వ్యవహారంలోనే ఈ సోదాలు జరిగాయని తెలిపాయి. కంపెనీకి సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది.మదుపరులు, గృహ కొనుగోలుదారుల నుంచి సేకరించిన కోట్లాది రూపాయల నగదును వివిధ షెల్ కంపెనీలకు తరలించారన్న ఆరోపణలపై సూపర్ టెక్ ప్రమోటర్ అయిన ఆర్‌కే అరోరాను ఈ ఏడాది జూన్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 670 మంది గృహ కొనుగోలుదారులను రూ.164 కోట్లు మేర మోసగించారన్న ఆరోపణలపై వివిధ పోలీస్‌స్టేషన్లలో 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. మొత్తం రూ.440 కోట్ల మేర నిధులను పక్కదారి పట్టినట్టు గుర్తించింది. 1988లో ప్రారంభమైన సూపర్ టెక్ కంపెనీ.. దిల్లీ రాజధాని ప్రాంతంలో సుమారు 80వేల ఇళ్లను అందించింది. ప్రస్తుతం ఎన్‌సీఆర్ పరిధిలో 25 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 20వేల మంది కస్టమర్లకు గృహాలను అందివ్వాల్సి ఉంది. వాస్తవానికి గతేడాది నుంచి కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. నోయిడాలోని సంస్థకు చెందిన ట్విన్ టవర్స్‌ను సుప్రీం ఆదేశాలతో కూల్చివేయడంతో కంపెనీకి రూ.500 కోట్లు మేర నష్టల వాటిల్లింది. మరోవైపు రూ.432 కోట్లు మేర చెల్లింపులు చేయలేదంటూ యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఈ ఏడాది మార్చిలో దివాలా పిటిషన్‌ను ప్రారంభించింది. దీన్ని అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో అరోరా సవాల్ చేశారు.
* అమెరికా బాండ్ ఈల్డ్‌లలో వడ్డీ పెరుగుదల
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మొదలగు రాజకీయ ఉద్రిక్తతల మధ్య విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ.378 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అమెరికా బాండ్ ఈల్డ్‌లలో వడ్డీ పెరుగుదల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో విదేశీ ఇన్వెస్టర్స్ అమ్మకాలను కొనసాగించగా, ప్రస్తుతం నెలలో అమ్మకాలను తగ్గించారు. వరుస మూడు నెలల అమ్మకాలకు నవంబర్ నెలలో కొంత మేరకు బ్రేక్ పడింది. ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐ ల విలువ నవంబర్ 24 నాటికి రూ.13,673 కోట్లుగా ఉందని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) డేటా పేర్కొంది. FPIలు నవంబర్ 15 నాటికి కొనుగోళ్లపై దృష్టి పెట్టి అమ్మకాలను భారీగా తగ్గించారు. ముఖ్యంగా నవంబర్ 15, 16 తేదీల్లో ఎక్కువగా కొత్త పెట్టుబడులు పెట్టారు.
* రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కొత్త హిమాలయన్‌ను లాంచ్
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అడ్వెంచర్ మోటార్ సైకిల్ కొత్త హిమాలయన్‌ను (Royal Enfield Himalayan) లాంచ్ చేసింది. గోవాలో జరిగిన మోటోవెర్స్ ఈవెంట్‌లో దీన్ని తీసుకొచ్చింది. దీని ధర రూ.2.69 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఇది లాంచింగ్ ఆఫర్ మాత్రమే. డిసెంబర్ 31 తర్వాత ధరలు పెంచుతామని కంపెనీ పేర్కొంది. కొత్త హిమాలయన్ మూడు వేరియంట్లలో వస్తోంది.బేస్ వేరియంట్‌ను మౌంటెయిన్ పేరుతో పిలుస్తున్నారు. ఇది కాజా బ్రౌన్ రంగులో లభిస్తుంది. మిడ్ వేరియంట్‌ను పాస్‌గా పిలుస్తారు. ఇది స్లేట్ హిమాలయన్ సాల్ట్, స్లేట్ హిమాలయన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.2.74 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఇక టాప్ వేరియంట్‌ను పీక్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో క్యామెంట్ వైట్ ధర రూ.2.79, హన్లే బ్లాక్ రూ.2.84 లక్షలుగా కంపెనీ పేర్కొంది.ఇక ఇంజిన్ విషయానికొస్తే.. కొత్త హిమాలయన్ 451 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 40.02 బీహెచ్‌పీ పవర్‌ను, 40ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ముందువైపు 21 అంగుళాల వీల్, వెనుక వైపు 17 అంగుళాల స్పోక్ వీల్స్‌తో వస్తోంది. ముందువైపు 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక వైపు 270 ఎంఎం డిస్క్ అమర్చారు. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ అమర్చారు.ఇందులో అడ్జస్టబుల్ సీట్ ఉంది. ఎత్తు కావాల్సిన విధంగా 825 ఎంఎం నుంచి 845ఎంఎం వరకు పెంచుకోవచ్చు. లోయర్ సీటును 805-825 ఎంఎం వరకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. 17 లీటర్ల సామర్థ్యం కలిగిన మెటాలిక్ ట్యాంక్‌ను అమర్చారు. ఈ మోటార్ సైకిల్ బరువు 198 కేజీలు. కొత్త హిమాలయన్‌లో టీఎఫ్‌టీ డ్యాష్ బోర్డును స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్‌తో కలిసి నావిగేషన్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ఎకో, పెర్ఫార్మెన్స్, రియర్ ఏబీఎస్ ఆన్, పెర్ఫార్మెన్స్ విత్ రేర్ బీఎస్ ఆఫ్ వంటి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. బైక్ మొత్తం ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తోంది. ఈ మోటార్ సైకిల్ టాప్ స్పీడ్ 150 కిలోమీటర్లు. లీటర్‌కు 28 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
👉 – Please join our whatsapp channel here –