DailyDose

దాతలు ఈ విషయాలు తెలుసుకోవాలి!

దాతలు ఈ విషయాలు తెలుసుకోవాలి!

ఎవరి సంపాదన వారిది. ఎవరి ఖర్చులు వారివి. చివరగా మిగిలిన సొమ్ములోంచి కాస్తంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలకు విరాళంగా ఇవ్వాలనుకునేవారూ ఉంటారు. మంచి ఆలోచనే. సంఘజీవిగా అది బాధ్యత కూడా. మరో కోణంలో చూస్తే.. మానసిక సంతృప్తి కోసం మనం పెడుతున్న పెట్టుబడి అది. అందులో ప్రతి రూపాయీ మన స్వార్జితమే. ఆ సొమ్ము దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

దాతృత్వం అనేది బలమైన పాజిటివ్‌ ఎమోషన్‌. పంచుకోవడంలోని ఆనందం అనిర్వచనీయం. దీనివల్ల మన జీవితానికి సార్థకత లభించిన అనుభూతి కలుగుతుంది. లేనివారితో పంచుకోవడం ఉన్నవారి బాధ్యత కూడా. కాబట్టే, ఆర్థిక మానసిక వేత్తలు దాతృత్వాన్ని ‘మానవీయ పెట్టుబడి’గా అభివర్ణిస్తారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు దీర్ఘకాలంలో మన ఆస్తుల విలువను పెంచినట్టు.. విరాళాలు, దానాలు, సేవ.. హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో మన గ్రాఫ్‌ను పైపైకి తీసుకెళ్తాయి. ‘ఓ అనాథ శరణాలయానికి నేనిచ్చిన విరాళమే నా జీవితంలో అత్యుత్తమ పెట్టుబడి’ అంటారు వారెన్‌ బఫెట్‌. కానీ, సమాజం కోసం మనం కేటాయించిన సొమ్ము అందాల్సినవారికి అందినప్పుడే.. ఆ అనుభూతి, ఆనందాలకు సార్థకత. కాబట్టి సంస్థల ఎంపికలో, వ్యక్తుల బేరీజులో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారన్నది తెలుసుకోవాలి.

సరైన ఎన్జీవో కోసం..

దినపత్రికలలో ప్రకటనలు, సోషల్‌ మీడియాలో ప్రచారాలు, తరచూ పలకరించే ఎస్సెమ్మెస్‌లు, కూడళ్ల దగ్గర పంచే కరపత్రాలు.. సాయం కోరుతూ, మద్దతు కోసం విజ్ఞప్తి చేస్తూ ఏదో ఓ రూపంలో మన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దేశంలో ముప్పై లక్షలకు పైగా ఎన్జీవోలు (ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు) ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పేదల కోసం, అనాథల కోసం, వృద్ధుల కోసం, శారీరక-మానసిక వికలాంగుల కోసం, పర్యావరణం కోసం, రాజకీయ చైతన్యం కోసం.. ఇలా తమదైన రంగంలో నిజాయతీగా పని చేస్తున్న సంస్థలు అనేకం. దాతృత్వ ప్రధాన ఉద్దేశం ఆత్మసంతృప్తి. మనకు ఇష్టమైన, మన జీవితంతో ముడిపడిన సత్కార్యానికి డబ్బు కేటాయించినప్పుడు.. ఆ సంతృప్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి తగిన ఎన్జీవోనే కాదు, ఆ సంస్థ కార్యకలాపాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

కళ్లారా చూడండి..

అవార్డులు, బ్యాలెన్స్‌షీట్‌, పత్రికలలో కథనాలు.. అన్నీ ఒక ఎత్తు. అంతిమంగా మీరు కళ్లారా చూసిందే నిజం. మీకు నచ్చితేనే నచ్చినట్టు. కాబట్టి, మనసుకు దగ్గరగా అనిపించిన ఎన్జీవోను ఎంచుకోగానే.. ఓ పూట ఆ ఆవరణకు వెళ్లండి. అక్కడి పిల్లలు, అనాథలు, నిర్భాగ్యులతో మాట్లాడండి. అదే రంగంలో పనిచేస్తున్న మిగతా సంస్థలనూ సందర్శించండి. ఏ సంస్థ ఎక్కువ జీవితాలను ప్రభావితం చేస్తున్నది, ఏ సంస్థకు బతుకులను మార్చే శక్తి ఉంది, ఎవరి చేతిలో పెడితే కనుక మీ కష్టార్జితం సద్వినియోగం అవుతుంది.. అనేది కోణంలో ఆలోచించండి. కొన్ని సంస్థలు.. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చుచేస్తున్నది, ఎవరికి సాయం చేస్తున్నది తెలియజేస్తూ న్యూస్‌లెటర్‌ కూడా ఇస్తాయి. ఇలాంటి సమాచారం వల్ల.. మనకు ఆ ఎన్జీవో పట్ల నమ్మకం పెరుగుతుంది. ఆత్మీయులకు సిఫారసు చేస్తాం కూడా. దాతృత్వానికి పెట్టుబడి సూత్రాలను జోడిస్తున్నవారూ ఉన్నారు. నెలనెలా కొంత మొత్తాన్ని సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)కు మళ్లించి.. దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. దీనివల్ల మరింత మొత్తం పోగవుతుంది. మరిన్ని జీవితాలు బాగుపడుతాయి. ప్రతినెలా గుర్తుంచుకుని చెల్లించడం కష్టం అనిపిస్తే.. ఎలక్ట్రానిక్‌ క్లియరెన్స్‌ సిస్టమ్‌ (ఈసీఎస్‌) ద్వారా నెలనెలా ఫలానా తేదీన నిర్ణీత మొత్తాన్ని ఏదైనా ఎన్జీవో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయవచ్చు. ఎంచుకున్న సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడమూ ఒక పద్ధతి. నేరుగా డబ్బు ఇవ్వకపోయినా.. మన వృత్తి నైపుణ్యాన్ని ఆయా ఎన్జీవోల కోసం వినియోగించడం ద్వారానూ ఆత్మసంతృప్తి పొందవచ్చు. ఇది ఆర్థికేతర సేవ. మనం గీసిన పెయింటింగ్స్‌, మనం రాసిన పుస్తకాలు, మనం చెక్కిన శిల్పాలు.. విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా నలుగురి కోసం మళ్లించవచ్చు. మనకు సేద్యం ఉంటే, పంటలో కొంత భాగాన్ని పేదలకు పంచవచ్చు. మనసుంటే మార్గాలు అనేక. దారి ఏదైనా దాతృత్వం గొప్ప లక్షణం.

పన్ను మినహాయింపు..

విరాళాల ద్వారా ఆదాయపన్ను ప్రయోజనాన్నీ పొందొచ్చు. ఇన్‌కమ్‌టాక్స్‌ యాక్ట్‌-1961లోని సెక్షన్‌ 80 జీ ప్రకారం.. యాభై నుంచి నూరు శాతం పన్ను వినహాయింపు లభిస్తుంది. కానీ, ఆ విరాళం మన మొత్తం ఆదాయంలో పదిశాతానికి మించకూడదు. అయితే, ఇక్కడో నిబంధన ఉంది. మనం విరాళం అందించిన సంస్థలకు 80 జీ రిజిస్ట్రేషన్‌ తప్పక ఉండాలి. అప్పుడే, నోటిఫైడ్‌ సంస్థల జాబితాలో చోటు లభిస్తుంది. మినహాయింపులకు వీలూ ఉంటుంది. కొత్త టాక్స్‌ విధానాన్ని ఎంచుకునేవారికి ఈ మినహాయింపు వర్తించదు. పాత పద్ధతినే ఎంచుకున్నా.. రెండు వేల రూపాయలకు మించిన నగదు విరాళాలు ఈ పరిధిలోకి రావు. దుస్తులు, వస్తువులు, ఆహారం, పుస్తకాల రూపంలో ఇచ్చిన విరాళాలు కూడా 80 జీ కింద అనర్హమైనవే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z