తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సీఎం జగన్ మోహన్‌రెడ్డి రూ.లక్షల కోట్లు సంపాదించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ఒకప్పుడు పేదరికంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం.. దోపిడీతో ₹5లక్షల కోట్లు ఆర్జించింది. 2003లో వైఎస్ కుటుంబం రూ.9.19 లక్షలకు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసింది. 2004 ఎన్నికల సమయంలో డబ్బులు లేక అవస్థలు పడింది. ఆ సమయంలో వారికి ఉన్న ఒకే ఒక ఇల్లు అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసి ప్రజలను మభ్యపెట్టారు. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక.. జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారు. క్విడ్‌ప్రోకో కింద సీబీఐ 11 కేసులు నమోదు చేసింది. 8 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి రూ.45 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అధికారులు సీజ్ చేశారు.
ఆ తర్వాత ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ సీఎం అయ్యాక రూ.4లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఆయన మారారు. ప్రజల ధనం దోపిడీ చేసి ఈ స్థాయికి వచ్చారు. జగన్ దోపిడీపై పిల్ వేస్తే హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. రూ.లక్షల కోట్లు దోచిన జగన్‌రెడ్డి.. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు. డబ్బు, అధికారం అండతో వ్యవస్థలను ఆయన మేనేజ్ చేస్తున్నారు. పిక్ పాకెట్ కేసులో కూడా కోర్టుకు వెళ్లకుంటే వారెంట్ ఇస్తారు. కానీ లక్షల కోట్లు దోచుకున్న జగన్ మాత్రం.. సంవత్సరాల తరబడి కోర్టుకు వెళ్లడం లేదు. దోపిడీ సొమ్ముతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు’’ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –