Politics

నేనూ రైతునే!

నేనూ రైతునే!

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఎలా జరిగిందో.. పదేళ్ల భారాస పాలనలో ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరారు. గ్రామాల్లో ప్రజలంతా చర్చించి.. అభ్యర్థుల గురించి ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.

‘‘రాష్ట్ర సంపదను పెంచి పింఛను అందిస్తున్నాం. కాంగ్రెస్‌ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదు. భారాస పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. పదేళ్ల నుంచి భారాస అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అనేక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. 3 గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో పడేస్తామని అంటున్నారు. అదే జరిగితే ప్రజలు దెబ్బతింటారు. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే ధరణికి దండం పెడతారు. దాంతో లంచాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలతో పాత కష్టాలు మళ్లీ మొదలవుతాయి. 50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రాన్ని భారాస పదేళ్ల పాలనలో పోగొట్టాం. నేనూ రైతునే. వారి బాధలు నాకు తెలుసు. ధరణి తీసేస్తే వచ్చే బాధలు, కష్టాలపై ప్రజలు చర్చించాలి. కారు గుర్తుపై ఓటేసి ఖానాపూర్‌ భారాస అభ్యర్థి జాన్సన్‌ను గెలిపించాలి’’ అని కేసీఆర్‌ కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z