DailyDose

కొత్త రేషన్‌ కార్డులు ఇస్తాం-తాజా వార్తలు

కొత్త రేషన్‌ కార్డులు ఇస్తాం-తాజా వార్తలు

 తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల(Tirumala)కు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(Ttd) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 68,179 మంది భక్తులు దర్శించుకోగా 29,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చిందని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ అధికారులు ఆలయం ఎదుట స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు.

* కొత్త రేషన్‌ కార్డులు ఇస్తాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి నెలలో కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మళ్లీ భారాస అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ‘‘ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే 3 గంటలే కరెంట్‌ వస్తుంది. ఆ పార్టీకి ఓటేస్తే మనకు మరణమే. కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా?అప్పట్లో రూ.200 పింఛన్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటున్నారు. కాంగ్రెస్‌ మాటలు నమ్ముతామా?’’ అని అన్నారు.‘‘ 2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ ప్రస్తుతం రూ.1200 అయ్యింది. మళ్లీ భారాస అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73వేల కోట్లను భారాస జమ చేసింది. కేసీఆర్‌ పోరాటంతో మనకు తెలంగాణ సాకారమైంది. ఆయన దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించింది. ఈసారి కూడా నవంబర్‌ 29న దీక్షాదివస్‌ నిర్వహిస్తాం. భారాస శ్రేణులు ఎక్కడివారు అక్కడ దీక్షాదివస్‌ నిర్వహించాలి. సేవా కార్యక్రమాలు చేపట్టాలి. అస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి’’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి తన పాత పార్టీ భాజపాపై ప్రేమ ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అందుకే గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు. గోషామహల్‌లో భాజపా అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

*   కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. నవంబర్ 26 ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కాళేశ్వరానికి భక్తులు తరలి వస్తున్నారు. కార్తీక మాసం కావడంతో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి.. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఉసిరిచెట్టు దగ్గర మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

* కాలుష్యం కోరల్లో దేశ రాజధాని

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. నగరంలో రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరిగిపోతున్నది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగకు తోడు, పంజాబ్‌ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత కూడా ఢిల్లీకి శాపంగా మారింది. దాంతో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర స్థాయికి పెరిగిపోతున్నది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఓవరాల్‌ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 393 గా ఉన్నది.ఇవాళ ఉదయం 7 గంటలకు జహంగీర్‌పురి ఏరియాలో అత్యధికంగా 450 ఏక్యూఐ నమోదైంది. బవానా (AQI-437), అశోక్‌ విహార్‌ (AQI-434), ఆనంద్‌ విహార్‌ (AQI-433) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ స్థాయిల వాయు కాలుష్యాన్ని తీవ్ర కాలుష్యంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఐటీవో ప్రాంతంలో 382, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర 360 ఏక్యూఐ నమోదైంది. అంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉన్నదని అర్థం.కాగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 100 లోపు ఉంటే దాన్ని కాలుష్య రహిత వాతావరణంగా చెప్పవచ్చు. ఏక్యూఐ 100 నుంచి 200 వరకు ఉంటే ఓ మోస్తరు కాలుష్యంగా పేర్కొంటారు. ఏక్యూఐ 200 నుంచి 300 వరకు ఉంటే కాలుష్య భరిత వాతావరణంగా చెబుతారు. ఏక్యూఐ 300 నుంచి 400 వరకు ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉన్నదని, ఏక్యూఐ 400 నుంచి 500 వరకు ఉంటే తీవ్రమైన వాయు కాలుష్యంగా చెప్తారు.

శ్రీకిరణ్‌ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం

వైకాపా నేతల భూదాహమే యువ వైద్యుడిని బలి తీసుకుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడు కల్యాణ్.. భూదందాలు, దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు నున్న శ్రీకిరణ్‌ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. శ్రీకిరణ్‌కి చెందిన 5 ఎకరాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా, ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తనవద్దే ఉంచుకుని కల్యాణ్ వేధిస్తుండటం వల్లే యువ డాక్టర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆక్షేపించారు. ఇది ముమ్మాటికీ వైకాపా భూ బకాసురులు చేసిన హత్యేనని లోకేశ్‌ ఆరోపించారు. డాక్టర్ మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు తీసుకోవ‌డం స‌మ‌స్యకి ప‌రిష్కారం కాదని, బాధితులంతా ఏక‌మై రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా దందాలు, క‌బ్జాల‌ను ఎదురించాలన్నారు.

పవన్ లోకేష్‌లకు మాజీ మంత్రి సవాల్‌

ఆర్య వైశ్యులకు తానేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆఫీస్‌కు రమ్మన్నా వచ్చేందుకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్య వైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.‘‘చంద్రబాబు ఎప్పుడూ ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ సీఎం అయ్యాక అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులిచ్చారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కార్తీక పౌర్ణమి స్నానాల కోసం వేలాది మంది భక్తులు వచ్చే చోట వారికి ఇబ్బంది కలిగేలా కార్యక్రమం తలపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులు’’ అని వెల్లంపల్లి మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు. విజయవాడ పశ్చిమ టిక్కెట్  వైశ్యులకు ఇచ్చే దమ్ము లోకేష్‌కి ఉందా?. పోతిన మహేష్‌ సిగ్గు లేకుండా చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.

* బర్రెలక్క అందరికీ ఆదర్శం

ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ పడుతున్న శిరీష అలియాస్ బర్రెలక్కకు  తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

 బాల్క సుమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు

చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు నిరసన  సెగ తగిలింది. ఆదివారం (నవంబర్26) ఎన్నికల ప్రచారంలో భాగంగాల చెన్నూరు నియోజవర్గంలోని కిష్టాపూర్ గ్రామానికి వెళ్తుండగా..ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. గ్రామంలో రావొద్దంటూ..ఊరిబటయ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ తూతూ మంత్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అక్కడి నుంచి వెళ్లి పోయాడు బాల్కసుమన్.ఈ సందర్భంగా రైతులు లంబు సత్యనారాయణ రెడ్డి, మాయ శ్రీధర్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో గ్రామంలోని 4వందల ఎకరాలు పంట పొలాు నీటి మునిగిపోతుంటే.. రైతుల బాగోగులు బాల్క సుమన్ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు కూడా నష్ట పరిహారం చెల్లంచలేదని.. ఎన్నికల రాగానే ఓట్లు అడిగేందుకు మా ఊరికి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు.కిష్టాపూర్ శివారులోని సర్వే నెంబర్ 50లో ఏళ్ల తరబడి భూ సమస్యలను ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూసమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతు బంధు, కొంత మంది చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా కూడా రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాపిరెడ్డి, మహిపాల్ రెడ్డి, రమణారెడ్డి, రాయమల్లు, రాజయ్య, మరికొంతమంది రైతులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z