ఓ వైపు తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది.. మరోవైపు ఎక్సైజ్ పాలసీ(మద్యం విధానం) గడువు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆబ్కారీ శాఖ మద్యం విక్రయాలపై దృష్టిసారించింది. ఎమ్మార్పీ ధరకంటే తక్కువకు విక్రయించొద్దని వ్యాపారులకు స్పష్టం చేస్తోంది. అలా విక్రయిస్తే చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలున్నాయి. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపేయాల్సి ఉంటుంది. దీనికితోడు ఈ నెల 30తో ప్రస్తుత మద్యం విధానం గడువు ముగియనుంది. డిసెంబరు 1 నుంచి కొత్త లైసెన్స్‌దారులు విక్రయాలు ప్రారంభించనున్నారు. దీంతో ఆ గడువులోగా మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లోని నిల్వలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వ్యాపారులు 27వ తేదీతోపాటు 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మొత్తం మద్యాన్ని విక్రయించాలి. స్వల్ప వ్యవధిలో తమ వద్ద ఉన్న నిల్వలను ఖాళీ చేయడానికి వ్యాపారులు ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయిస్తారన్న ఉద్దేశంతో ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా పెంచారు. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించొద్దంటూ ఆబ్కారీ శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాశ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం.. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యం అమ్మితే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా విధించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. నేరం రుజువైతే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని మద్యం వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –