న్యాయవ్యవస్థలో వేర్వేరు స్థాయుల్లోకి ప్రతిభావంతులైన యువత వచ్చేందుకు వీలుగా ‘అఖిల భారత న్యాయసేవ’ (ఆలిండియా జుడీషియల్ సర్వీస్)ను తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. ప్రజలు న్యాయసేవను అందుకోవడంలో వ్యయం, భాష అనేవి అడ్డంకిగా నిలుస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘రాజ్యాంగంలో మన న్యాయవ్యవస్థకు విశిష్ట స్థానం ఉంది. న్యాయవాదుల్లో, న్యాయమూర్తుల్లో భిన్నవర్గాలకు ప్రాతినిధ్యం ఉండడం వల్ల న్యాయసేవల్ని మెరుగ్గా అందించగలం. ప్రతిభ ఆధారంగా, పోటీతత్వంతో, పారదర్శకంగా నియామకాలు జరిగేలా దేశవ్యాప్త వ్యవస్థను తీసుకువస్తే ఇది మరింత పరిపుష్టం అవుతుంది. కింది నుంచి పైస్థాయి వరకు ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేందుకు ఈ వ్యవస్థ దోహదపడాలి. దీనికి కావాల్సిన సమర్థ యంత్రాంగాన్ని ఎలా తీసుకురావాలనేది న్యాయవ్యవస్థకే వదిలేస్తున్నా’ అని రాష్ట్రపతి అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థుల్ని న్యాయవ్యవస్థలోకి ఆహ్వానించాలని చెప్పారు.
పౌరుల కేంద్రంగా ఉండాలి
‘ప్రతి ఒక్కరికీ న్యాయం అందుతోందా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ అర్ధరాత్రి సమయంలోనైనా న్యాయగంట మోగించగానే రాజులు వచ్చి న్యాయం చేసేవారని నా చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి ఆశ్చర్యపోయేదాన్ని. రోజులో ఏ సమయంలోనైనా ఆ గంట మోగించవచ్చంటే ఇక రాజులకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుందని అనుకునేదాన్ని. తర్వాత నాకు తెలిసిందేంటంటే.. అలా తనను నిద్ర లేపాల్సిన అవసరం అరుదుగా మాత్రమే వచ్చేలా వారు న్యాయం అందజేసే వ్యవస్థను తీర్చిదిద్దేవారని! న్యాయం అందుబాటులోకి రావాలంటే మొత్తం వ్యవస్థను పౌరుల కేంద్రంగా మార్చాలి. వలసవాద కాలంనాటి విధానాలను ఇప్పటికే వదిలించుకుంటూ వస్తున్నాం’ అని ముర్ము చెప్పారు. సుప్రీంకోర్టు అంటే ప్రజల న్యాయస్థానమని, ఇక్కడికి వచ్చేందుకు పౌరులు భయపడకూడదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏడడుగుల విగ్రహాన్ని రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టులో ఆవిష్కరించారు.
👉 – Please join our whatsapp channel here –