Business

ఈ బ్యాంకు ఖాతా వారికి గుడ్‌ న్యూస్- వాణిజ్య వార్తలు

ఈ బ్యాంకు ఖాతా వారికి గుడ్‌ న్యూస్- వాణిజ్య వార్తలు

* డీఎల్‌ఎఫ్‌లో కార్యాలయంలో ఈడీ సోదాలు

రియల్టీ రంగ దిగ్గజ సంస్థ అయిన డీఎల్‌ఎఫ్‌ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మనీలాండరింగ్‌ కేసులో డీఎల్‌ఎఫ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు నిర్వహించింది.నోయిడాలోని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా గురుగ్రామ్‌లో ఆస్తులు కొనుగోలు చేయడానికి సూపర్‌టెక్ గ్రూప్ నిధులు సేకరించింది. సంస్థ ఛైర్మన్ రామ్ కిషోర్ అరోరా గృహ కొనుగోలుదారులు, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.638 కోట్లను మళ్లించారని ఈడీ జూలైలో పేర్కొంది. అయితే సూపర్‌టెక్‌ గ్రూప్‌తో డీఎల్‌ఎఫ్‌ సంస్థకు సంబంధం ఉండడంతో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం.ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయని, ఈ సందర్భంగా ఈడీ అధికారులు కొన్ని పత్రాలను పరిశీలించారని చెప్పారు. అయితే సూపర్‌టెక్‌కు సంబంధించి డీఎల్‌ఎఫ్‌ ఏ మేరకు సహకరించింది, ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయో వివరించలేదు.ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.638.93 కోట్లు నిధులు మళ్లించారని ఈడీ తెలిపింది. దీన్ని సూపర్‌టెక్ గ్రూప్, దాని ప్రమోటర్లు/ డైరెక్టర్లు తమ గ్రూప్ కంపెనీల ద్వారా తక్కువ ధర ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును వినియోగించినట్లు ఈడీ వివరించింది. 2013-14లో సర్వ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.444 కోట్లు వినియోగించారని ఈడీ తెలిపింది.

* ఈ బ్యాంకు ఖాతా వారికి గుడ్‌ న్యూస్

దేశంలో ప్రముఖ బ్యాంకుగా పిలవబడే స్టేజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఎస్బీఐ ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఒకేసారి బ్యాంకులో ఎక్కువ మొత్తం మనీ డిపాజిట్ చేసి ప్రతి నెలా డబ్బులు పొందాలని అనుకునే వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల 10 ఏళ్ల పాటు ఏకంగా నెలకు 11 వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ టెన్యూర్‌‌ను ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎంచుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ మొత్తంలో లాభాలు ఉంటాయంటున్నారు. ఈ పథకం ద్వారా కనీసం రూ.1000 నుంచి ఎక్కువ మొత్తం కూడా పొందే అవకాశం కూడా ఉంది.అలాగే ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా పొందే రాబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 75 % వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందే చాన్స్ కూడా ఉంటుంది. ఈ స్కీమ్‌లో 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.11,870 పొందే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బులకు 6.5 శాతం వడ్డీ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ యాన్యుటీ డిపాజిట్ పథకం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. స్థానికంగా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

* గెలాక్సీ ఏ05 శామ్‌‌సంగ్‌‌ ఇండియన్ మార్కెట్‌‌లో లాంచ్‌‌

గెలాక్సీ ఏ05 మోడల్‌‌ను శామ్‌‌సంగ్‌‌ ఇండియన్ మార్కెట్‌‌లో లాంచ్‌‌ చేయాలని చూస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌లో మీడియాటెక్ హెలియో జీ85 ఎస్‌‌ఓసీ చిప్‌‌సెట్‌‌, 5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ, 6.7 ఇంచులు పీఎల్‌‌ఎస్‌‌ ఎల్‌‌సీడీ డిస్‌‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 4జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.12,500 ఉండొచ్చని అంచనా.

* ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఐక్యూబ్‌’ అదుర్స్‌

వచ్చే ఏడాది వ్యవధిలో తమ విద్యుత్‌ ద్విచక్ర వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తామని టీవీఎస్‌ మోటార్‌ (TVS Motor) తెలిపింది. వివిధ ధరల శ్రేణితో కస్టమర్లకు చేరువవుతామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ రెండు ఇ-స్కూటర్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో విక్రయ మౌలిక వసతులను సైతం విస్తరిస్తామని తెలిపింది. ఓ ఎలక్ట్రిక్‌ త్రీ-వీలర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.వచ్చే ఏడాది వ్యవధిలో 5- 25 కిలోవాట్ల మధ్య శ్రేణిలో వరుస స్కూటర్లను విడుదల చేస్తామని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డైరెక్టర్‌ సీఈఓ కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌ (TVS Motor iQube)కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని పేర్కొన్నారు. దీంతో నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 25 వేల యూనిట్లకు పెంచినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచుతామని పేర్కొన్నారు.ప్రస్తుత త్రైమాసికంలోనే టీవీఎస్ తమ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘టీవీఎస్‌ ఎక్స్‌ (TVS X)’ విక్రయాలను ప్రారంభించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఇ-స్కూటర్ల కోసం 400 టచ్‌పాయింట్లు ఉన్నాయని రాధాకృష్ణన్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త ఉత్పత్తుల వరుస విడుదల నేపథ్యంలో మౌలిక వసతులను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.మరోవైపు ఎగుమతుల గురించి మాట్లాడుతూ.. వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో ఐక్యూబ్‌ చాలా మార్కెట్లలోకి విస్తరిస్తుందని రాధాకృష్ణన్‌ తెలిపారు. ఐరోపా మార్కెట్‌లోకీ ప్రవేశిస్తామన్నారు. స్పష్టమైన వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని.. దశలవారీగా ఇతర మార్కెట్లకూ విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశీయ, విదేశీ విపణుల్లో ‘టీవీఎస్‌ ఎక్స్‌’ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

* యెస్​పై బ్యాంకుపై వేసిన పిటిషన్ ​వెనక్కి

రూ.48,000 కోట్ల స్ట్రెస్ అసెట్ పోర్ట్‌‌‌‌ఫోలియోను యెస్ బ్యాంక్ నుండి జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీకి బదిలీ చేయడంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌‌‌‌ను ఉపసంహరించుకోవడంపై పార్టీ నుంచి అభ్యంతరం లేదని గమనించి, ఈ అంశంపై తదుపరి విచారణను రద్దు చేసింది. ప్రస్తుత రిట్ పిటిషన్​ను ఉపసంహరించుకున్నందున కొట్టివేస్తున్నామని జస్టిస్ మినీ పుష్కర్‌‌‌‌లతో కూడిన ధర్మాసనం నవంబర్ 22 న ప్రకటించింది. అసెట్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీలకు లైసెన్సింగ్ నిర్వహణ కోసం ఆర్​బీఐ మార్గదర్శకాలను జారీ చేసినట్టు పిటిషనర్​ చెప్పారని పేర్కొంది. బ్యాంకులు/ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ లేదా ఇతర ఆర్థిక సంస్థలు, ఏఆర్‌‌‌‌సీల మధ్య కుదిరిన ఏర్పాట్లను నియంత్రించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని ఆదేశించాలని కోరుతూ స్వామి ఈ ఏడాది ప్రారంభంలో హైకోర్టును ఆశ్రయించారు.

* 12 ల‌క్ష‌లు ఆర్జిస్తున్న భార‌త గేమ‌ర్లు

భార‌త్‌లో గేమింగ్ ప‌రిశ్ర‌మ (Indian Gamers) గ‌త రెండేండ్ల‌లో గ‌ణ‌నీయంగా వృద్ధి చెంద‌డంతో ప‌లువురు యువకులు (Indian Gamers) గేమింగ్ కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. ప్రొఫెష‌న‌ల్ గేమ‌ర్లు ఏటా రూ. 6 ల‌క్ష‌ల నుంచి రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఆర్జిస్తున్నారు. గేమ‌ర్లు స్ట్రీమింగ్‌, కంటెంట్ క్రియేష‌న్ ద్వారా కూడా పెద్ద‌మొత్తంలో రాబ‌డి పొందుతున్నారు.భార‌త్ గేమింగ్ ప‌రిస్ధితిపై ఇటీవ‌ల హెచ్‌పీ చేప‌ట్టిన అధ్య‌యనంలో ఈ వృత్తిని సీరియ‌స్‌గా తీసుకున్న వారిలో దాదాపు సగం మంది రూ. 6 ల‌క్ష‌ల నుంచి రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఏటా ఆర్జిస్తున్నార‌ని వెల్ల‌డైంది. 3500 మంది ఈ స‌ర్వే ప‌లుక‌రించ‌గా వీరిలో 70 శాతం మంది పీసీ యూజ‌ర్లు కాగా, 30 శాతం మంది మొబైల్ గేమ‌ర్లు. ఇక వీరిలో 75 శాతం మంది పురుషులు, 25 శాతం మంది స్త్రీలుగా ఉన్నారు.గేమింగ్ మెరుగైన కెరీర్ ఎంపిక‌గా ప‌లువురు భావిస్తున్న‌ట్టు ఈ అధ్య‌య‌నం తెలిపింది. గ‌త ఏడాదితో పోలిస్తే 2023లో భార‌త గేమ‌ర్ల‌లో స‌గం మంది ఏటా రూ. 6 ల‌క్ష‌ల నుంచి రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కూ సంపాదిస్తున్నారు. స్పాన్స‌ర్‌షిప్స్‌, ఈ-స్పోర్ట్స్ టోర్న‌మెంట్స్ పెరుగుద‌ల వ‌ల్ల కూడా గేమింగ్ ప‌రిశ్ర‌మ‌లోకి గ‌ణ‌నీయంగా పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతున్న‌ద‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. మ‌రోవైపు యువ‌త పెద్ద‌సంఖ్య‌లో గేమింగ్‌ను సీరియ‌స్ కెరీర్‌గా ఎంచుకునే ట్రెండ్ పెరుగుతున్న‌ద‌ని తేలింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z