DailyDose

ఎన్నికల సంఘానికి మరోసారి భారాస విజ్ఞప్తి- తాజా వార్తలు

ఎన్నికల సంఘానికి మరోసారి భారాస విజ్ఞప్తి- తాజా వార్తలు

* చంద్రబాబు పవన్‌కు సజ్జల సవాల్‌

అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వంద పథకాలు ఆపామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అర్హత ఉన్న వారికి ఎక్కడైనా పథకం ఆగిందా చెప్పాలంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు.

* ఎన్నికల సంఘానికి మరోసారి భారాస విజ్ఞప్తి

తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇవ్వాలని భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) విజ్ఞప్తి చేసింది. అనుమతి నిరాకరిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని… లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని అనుమతి మంజూరు చేసే సమయంలో ఈసీ షరతు విధించింది. అయితే, రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ సోమవారం ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారాస మరోసారి ఈసీని ఆశ్రయించింది. రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని.. చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని ఈసీని విజ్ఞప్తి చేసింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇవ్వాలని లేఖలో భారాస కోరింది.

ఢిల్లీ  చేరుకున్న చంద్రబాబు 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తిన చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నాం సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఢీల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడు దంపతులకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడులు ఘన స్వాగతం పలికారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు ఢిల్లీ ఉండనున్నారు. ఈనెల 27న చంద్రబాబు నాయుడు తరఫున ఆయన కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తనయుడు వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇకపోతే ఈనెల 28న కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో త్వరలోనే ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

ముంబయికి హార్దిక్‌

వచ్చే ఐపీఎల్ (IPL 2024) కోసం డిసెంబరు 19న మినీ వేలం నిర్వహించనున్నారు. డిసెంబరు 12 వరకు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం ఉంది.  ఇప్పటివరకు జరిగిన ఆటగాళ్ల ట్రేడింగ్‌లో హార్దిక్‌ పాండ్య  (Hardik Pandya), కామెరూన్ గ్రీన్‌ (Cameron Green) ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు. గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య తిరిగి ముంబయి ఇండియన్స్‌కు మారాడు. దీంతో శుభ్‌మన్ గిల్‌ని గుజరాత్ కెప్టెన్‌గా నియమించింది. ఇక, ముంబయి ఇండియన్స్‌ గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను ఆర్సీబీకి ఇచ్చేసింది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్‌ ఇవాళ అధికారికంగా ప్రకటించింంది. ఈ రెండు పెద్ద ట్రేడ్‌లు జరిగిన తర్వాత వేలం కోసం ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకుందాం.హార్దిక్‌ పాండ్యను ముంబయి ఇండియన్స్‌కు ఇచ్చేసిన గుజరాత్ టైటాన్స్‌ వద్ద అత్యధికంగా రూ.38.15 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద రూ. 34 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వద్ద రూ.32.7 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.31.4 కోట్లు, పంజాబ్ కింగ్స్‌ వద్ద రూ. 29.1 కోట్లు ఉన్నాయి. హసరంగ, హర్షల్‌ పటేల్‌, హేజిల్‌వుడ్‌, విల్లీ, పార్నెల్‌ లాంటి బౌలర్లను వదులుకున్న ఆర్సీబీ వద్ద రూ.23.25 కోట్లు ఉండగా.. దిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ. 28.95 కోట్లు, ముంబయి ఇండియన్స్‌ వద్ద రూ.17.75 కోట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద రూ.14.5 కోట్లు, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ.13.15 కోట్లు ఉన్నాయి.

కాంగ్రెస్ బిఆర్ఎస్ లు రెండూ అవినీతిమయ పార్టీలే

కాంగ్రెస్, బిఆర్ఎస్ లు  నాణానికి ఉన్న బొమ్మలని… అవినీతిలో రెండు పార్టీలు దొందు దొందేనని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. జగిత్యాల బిజెపి అభ్యర్థి బోగ శ్రావణి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు. జిల్లా పట్టణంలోని  కొత్త బస్టాండ్ నుంచి అంగడి బజార్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృధ్దితో పాటుగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ తనవంతు కృషి చేస్తుందన్నారు.కాంగ్రెస్, బిఆర్ఎస్ లు రెండూ అవినీతిమయ పార్టీలేనని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ అంటే, భ్రష్టాచార్ రాక్షస సమితి అని, కాంగ్రెస్ అంటే కరప్షన్ అని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి పదవిని బీసీలకే కట్టబెడతామనీ….బీసీ బిడ్డగా, అందరి ఆడబిడ్డగా బోగ శ్రావణిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని నడ్డా అభ్యర్థించారు. మహిళలు, యువత సంక్షేమం కోసం బీజేపీ పాటుపడుతుందని చెప్పారు.  మోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృధ్ది కోసం చేస్తున్న ఈ యుధ్దంలో బీజేపీకి మద్దతు తెలపాలని నడ్డా కోరారు.

విశాఖ జూ పార్కులో విషాదం

విశాఖ జూ పార్క్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని అతడు క్లీనింగ్‌ చేస్తుండగా సంఘటన సంభవించింది. ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తీర్చుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడం జరగడంతో సందర్శకులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాల నగేష్‌ను ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పవార్‌ ప్రసంగిస్తుండగా భారీ వర్షం

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (Nationalist Congress Party) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) ప్రసంగిస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం నవీ ముంబై (Navi Mumbai) లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయితే, వర్షంలో తడుస్తూనే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు (delivers speech in rain). ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఈ సీన్‌ 2019లో జరిగిన ఘటనను గుర్తు చేసింది.2019లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు అక్టోబర్‌ 18న సతారాలో పార్టీ అభ్యర్థి గెలుపు (లోక్‌సభ) కోసం పవార్‌ ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పక్కనున్న వారు గొడుగును ఆఫర్‌ చేసినప్పటికీ.. పవార్‌ దాన్ని తిరస్కరించారు. ఇది పార్టీకి వాన దేవుడు అందిస్తున్న ఆశీర్వాదం అని తెలిపారు. వర్షంలో తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పుడు అదే సీన్‌ రిపీట్‌ కావడంతో నాటి జ్ఞాపకాలను పార్టీ గుర్తు చేసుసుకుంటోంది.

కాంగ్రెస్ పార్టీ స్థానిక మేనిఫెస్టో 

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం పొట్లపల్లిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పొట్లపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ అఫిడవిట్‌లపై సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని 34 బూతుల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్ , అసెంబ్లీ పరిశీలకుడు గోపీనాథ్ పలనియప్పన్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z